ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఈ రికార్డును అందుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను వరుసగా రెండో నెలలో కూడా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకే పంపిణీ ప్రారంభించగా.. వరుసగా రెండో నెల సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీని చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజులోనే 97.50 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గత నెలతో పోలిస్తే ఇది సరికొత్త రికార్డు.. ఇక ఆగస్టులో మొత్తం 64.82 లక్షల మందికి పింఛన్లు అందించేందుకు గానూ రూ.2,737 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం రాత్రి 9 గంటల సమయానికి 63.18 లక్షల మందికి నగదు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుండుమలలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో పర్యటించారు. ముందుగా వితంతువు ఓబుళమ్మ, వృద్ధుడు రామన్న ఇంటికి వెళ్లి వారిద్దరికీ పింఛన్‌ను స్వయంగా అందజేశారు.
ఓబుళ్ల సీఎంకు తన కష్టాలను చెప్పుకున్నారు.. తనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలని.. ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారన్నారు. తనకు ఇళ్లు బాగోలేదని కుమారులు రావడం లేదన్నారు.. వెంటనే స్పందించిన చంద్రబాబు కలెక్టర్ చేతన్‌ను పిలిచి ఆమెకు ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే రామన్న కుమారుడికి స్థానికంగా ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. రాయితీతో డ్రిప్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
పింఛన్ల పంపిణీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గత పాలకుల తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా.. ఎలాంటి ఆటంకాలూ లేకుండా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి పెంచిన పింఛన్లను రెండో నెలలోనూ లబ్ధిదారులకు ఇంటి దగ్గరే విజయవంతంగా పంపిణీ చేశారని ప్రశంసించారు. లబ్ధిదారులకు పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చాలా దగ్గరైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
‘ఒకటో తేదీ తెల్లవారున ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు. పింఛన్లు అందుకున్న వితంతువులు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే మాకు ఆశీస్సులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాది మంది వ్యక్తం చేసిన ఆనందమే కూటమి ప్రభుత్వానికి అందిన వెలకట్టలేని బహుమానం’అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.