ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులక తీపికబురు చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని.. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను అభినందిస్తున్నానని.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీలేదు అన్నారు. పోలీసులు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారన్నారు. పోలీసుల సంక్షేమం ప్రభుత్వం బాధ్యతని.. ప్రతి ఏటా రూ.20 కోట్లు పోలీసు శాఖకు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో అమరావతిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తామని.. అమరావతిలో శాశ్వత అమరవీరుల సంస్మరణ స్థూపం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలు చేపడతామన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. వాహనాలతో పాటు పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామన్నారు. దేశంలోనే ఏపీ పోలీసు అంటే మోడల్‌గా తీర్చిదిద్దాలని ముందుకెళ్లామని.. 2014-2019 మధ్య రూ.600 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. అందులో పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు కేటాయించామన్నారు. పోలీసులకు ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించామన్నారు సీఎం.