ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల జాబితాలో వేచి చూస్తున్న వారిని జిల్లా కలెక్టర్ల కామన్ పూల్‌లోని ఖాళీల్లో నియమించే అంశంపై.. రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులతో చర్చించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ఉద్యోగులు, వాటి పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయులు మరణిస్తే.. వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్‌తో డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ సంస్థల పరిధిలో ఖాళీలు తక్కువ ఉండటంతో కారుణ్య నియామకాల్లో జాప్యం అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కారుణ్య నియామకాల అంశంపై సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులతో చర్చించాలని సూచించారు.
మరోవైపు కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని ఎదురుమొండి-గొల్లమంద రోడ్డు పునర్ నిర్మాణంపైనా పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు. ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.13.45 కోట్లతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల భారీ వరదలకు 700 మీటర్ల మేర కోతకు గురైన విషయాన్ని అధికారులు ప్రస్తావించారు.. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డు పునర్ నిర్మాణంపై ఆదేశాలు జారీ చేశారు.