ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పలు పథకాలకు పేర్లు మార్చారు. తాజాగా మరో పథకానికి ప్రభుత్వం పేరు మార్చింది. గత ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరు మార్చేసింది. జగనన్న తోడు పథకం పేరు మార్పు కోసం.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వం నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి.. జగనన్న తోడు పథకం కింద ఆర్థి చేయూతను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందించారు. అలాగే ఈ రుణాలను సకాలంలో చెల్లించినవారికి.. ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రధానంగా ఈ పథకానికి సంబంధించి.. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత, తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు అర్హులు. అలాగే తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారికి రుణాలు అందజేశారు. వీరితో పాటుగా రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వ్యాపారం చేసుకునేవాళ్లకు సాయం అందజేశారు. అలాగే గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం కింద రుణం అందించారు.
ఈ పథకం కింద 18 ఏళ్లు నిండినవారు.. నెలవారీ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12వేలలోపు ఉండాలి. అంతేకాదు మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు లేదా మాగాణి, మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు అర్హులు. వీరు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులైన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇతరాలు ఉండాలి. అలాగే బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గత ప్రభుత్వంలోని జగనన్న పథకం పేరును ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా మార్చేసింది. ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించనుంది.. చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణాలను అందజేయనున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు, విధి విధానాలను సిద్ధం చేసి.. ఈ పథకంపై క్లారిటీ ఇవ్వనుంది. ఈ పథకం డబ్బులు కూడా డిబీటీ ద్వారా అకౌంట్‌లలో జమ చేయనున్నారు.