ఏపీలో కొత్త పింఛన్‌ల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఆ నెల నుంచే డబ్బులు ఇస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. జనవరిలో కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.. జనవరిలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లతో పింఛన్లు పొందినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్ని వేల మంది అనర్హులు తప్పుడు సదరం ధ్రువీకరణపత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పలు జిల్లాల్లో ఈ అక్రమాలు బయటపట్టాయి. దివ్యాంగులు మాత్రమే కాదు.. చేనేత పింఛన్లలోనూ కొంతమంది అనర్హులు ఉన్నట్లు తేలింది.

ఇలా పింఛన్లలో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లడంతో.. పింఛన్ల తనిఖీ, కొత్త పింఛన్ల మంజూరుకు విధివిధానాల రూపకల్పన కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. వీరిలో మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్, డోలా బాల వీరాంజనేయస్వామి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, సవితలు ఉన్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. మంత్రుల కమిటీ ఏర్పాటైన 10-15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల ఎంపికకు నవంబర్‌ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మరోవైపు నవంబర్‌లోనే పింఛన్ల తనిఖీ చేస్తారు. రాష్ట్రంలో అనర్హులుగా తేలినవారికి నోటీసులిచ్చి, పింఛన్లు తొలగించేందుకు 45 రోజుల సమయం తీసుకుంటారు. ప్రధానంగా అర్హులెవరికీ అన్యాయం జరగకుండా.. అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామసభల్లో ప్రజల ముందు ఉంచుతారు. ఒకవేళ అక్కడ ఏవైనా ఫిర్యాదులు వస్తే సరిచేసి.. డిసెంబర్‌ నెలాఖరు నాటికి కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రస్తుత పింఛన్లలో అనర్హుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

గత ప్రభుత్వ హయాంలో 2.32 లక్షలమందికి పింఛన్ ఇవ్వలేదని చెబుతున్నారు. వారంతా గతేడాది సెప్టెంబర్‌లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవగా.. కొందరికి మాత్రమే మంజూరు చేశారు. చంద్రబాబు సర్కార్ ఈ దరఖాస్తుల్ని పరిశీలిస్తుందా, కొత్తగా మళ్లీ దరఖాస్తులు తీసుకుంటారా లేదా అన్నది కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ పింఛను అందిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్‌.. ఎన్నికల నాటికి 2.32 లక్షల మందికి పింఛను ఇవ్వకుండా నిలిపేశారు. 2023 సెప్టెంబర్‌ నాటికే వీరందరూ పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంతమందికి మాత్రమే మంజూరు చేసి మిగతా వారికి ఇవ్వకుండా నిలిపేశారు. కొత్త ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలిస్తుందా లేదా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారా అనేది మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించనుంది.

About amaravatinews

Check Also

తగ్గేదేలే.. వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాల్లో భారీ వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఫెయింజల్ తుఫాన్ అలజడి రేపింది.. తీరం దాటినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *