ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయాల్లో ప్రోటోకాల్స్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పండగలుగా ప్రకటించిన సందర్భాల్లో.. ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించే అంశంపై కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను.. సంబంధిత జిల్లా సీనియర్ మంత్రి గానీ, దేవాదాయ శాఖ మంత్రి గానీ, ఇంఛార్జ్ మంత్రి గానీ సమర్పిస్తారు.
ఈ మేరకు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.సత్యనారాయణ పండగల సమయంలో ఆలయాల్లో పాటించాల్సిన ప్రొటోకాల్‌పై ఉత్తర్వు జారీచేశారు. పండగల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సమన్వయం చేయాలని కూడా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అలాగే ఈ కార్యక్రమాలకు సంబంధించి ఖర్చును ఆయా శాఖలే భరించాలని కూడా పేర్కొన్నారు. ఒకవేళ అదనంగా ఖర్చులుంటే వాటిని ఆ ఆలయ నిధుల నుంచి గానీ, సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్) నుంచి కానీ వెచ్చించాలని తెలిపారు. గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు సీజీఎఫ్ నుంచి పండగలకు వెచ్చించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం రేగింది.. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన అంశంతో రాజకీయాలు వేడెక్కాయి. జగన్ శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని హిందూ సంఘాలు, కూటమి నేతలు డిమాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. కూటమి నేతలతో పాటుగా వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. అలాగే తిరుపతిలో యాక్ట్ 30న అమలు చేశారు. అయితే చివరి నిమిషంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు.
దారుణమన్నారు వైఎస్ జగన్. తాను గతంలో ఎన్నో సందర్భాల్లో తిరుమలకు వెళ్లానని.. గత ఐదేళ్లు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలను సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి రాక్షస ప్రభుత్వం ఎక్కడా చూడలేదని.. మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.