ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధం కాగా.. తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమస్యమలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సుపాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుండెజబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, థలసేమియా, లెప్రసీ, సీవియర్ హీమోఫిలియా వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని భావిస్తున్నారు.
ఇలా రాష్ట్రంలో 51 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛను ఇస్తున్న సంగతి తెలిసిందే. వీరంతా వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లి రావాల్సి ఉంటుంది.. ఆస్పత్రికి వెళ్లి రావాలంటే వారికి అదనపు వ్యయప్రయాసలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు నెలకు ఒకటి, రెండుసార్లయినా ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. వీరిలో పింఛను సదుపాయం కొద్ది మందికే ఉంది.. కొందరు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్నిబట్టి వారు రూ.200 నుంచి రూ.600 వరకు వ్యయం అవుతోంది. మరికొందరు 108 అంబులెన్సుల సేవలను పొందుతుండగా.. రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కూడా భారంగా మారుతోంది. అందుకే ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అకాశం ఉందంటున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యమైనది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఓ రిపోర్టును సిద్ధం చేశారు.. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని ఓ అంచనా వేశారు. ఏపీ అధికారులు తెలంగాణ, కర్ణాటక వెళ్లి ఈ పథకం అమలుపై అధ్యయనం చేశారు. ఏపీలో రోజూ సగటున 36-37 లక్షల మంది ప్రయాణిస్తుండా.. వీరిలో 15 లక్షల (40 శాతం మంది) వరకు మహిళలు ఉండగా.. వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది.
పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను బట్టి.. ఏపీలో ఎలా అమలు చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో అమలు చేస్తున్న విధానాన్ని అమలు చేయాలా.. ఏవైనా మార్పులు చేయాలా అనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటుగా.. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉంది అంటున్నారు. జీరో టికెట్ విధానంపై క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణ, కర్ణాటకల విధానమే ఏపీలో అమలుచేస్తే ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు.. ఏ సర్వీసులకు వర్తింపజేయాలన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆర్టీసీ ఉచిత బస్సు విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారని తెలుస్తోంది. ఈలోపు విధివిధానాలను విడుదల చేసే అవకాశం ఉంది.