ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో కార్పొరేషన్ ద్వారా అమలు చేసిన పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ఈ పథకాల్లో తొలి పథకంగా.. జీవనోపాధి కల్పనకు రూ.50 వేల రాయితీతో రుణాల మంజూరుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్‌ని అనుసంధానించి సెర్ప్ ద్వారా అమలుకు శ్రీకారం చుట్టింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,732 మంది ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా లబ్ధిదారులను.. ఈ నెల 10 నాటికి ఎంపిక పూర్తి చేయాలని తెలిపారు. ఈ పథకాన్ని డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకూ వర్తింపజేయాలని నిర్ణయించారు.. తొలి విడత వారికి యూనిట్‌ల ఏర్పాటు తర్వాత తదుపరి విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ పథకం మూడేళ్లపాటు కొనసాగనుంది.
ఈ రుణం మొత్తం చెల్లింపు తర్వాతే రాయితీ వర్తిస్తుంది.. ఈ పథకం కింద జీవనోపాధి యూనిట్ ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్‌కు రూ.50 వేల రాయితీ పోనూ మిగతా మొత్తాన్ని ఉన్నతి పథకం కింద వడ్డీ లేని రుణంగా ఇస్తారు. లబ్ధిదారులు జీవనోపాధి యూనిట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మొదట రూ.50 వేలు రాయితీని అందించకుండా రుణం మొత్తం చెల్లించాక (బ్యాక్ ఎండ్) వర్తిస్తుంది. యూనిట్ వ్యయంలో లబ్ధిదారుల వాటాగా 10 శాతాన్ని ఉన్నతి ఖాతాకు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి.. లబ్ధిదారుల ఎంపికలో ఒంటరి మహిళలు, వితంతువులు, యాసిడ్ దాడికి గురైన బాధిత మహిళలకు, దివ్యాంగులు, నిరుపేదలు, చదువుకున్న వారు, భూమి లేని వారికి ప్రాధాన్యం ఉంటుంది.