Puri Jagannath Temple: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. ఇప్పటికే కొన్ని నెలల క్రితం పూరీ ఆలయంలో తొలి విడత సర్వే నిర్వహించగా.. తాజాగా రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ-ఏఎస్‌ఐ అధికారులు శనివారం ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సర్వేలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేవతల దర్శనం కోసం వచ్చే భక్తులను నిలిపివేయనున్నారు. ఒడిశా రత్న భాండాగారంలోని నిధి నిక్షేపాలను వెలికితీయడం, సంపద అన్వేషణకు ఉద్దేశించిన ఈ సర్వే సోమవారం వరకు కొనసాగనుంది.
ఈ సర్వే కారణంగా 3 రోజుల పాటు ఒడిశా పూరీ ఆలయంలో పలు ఆంక్షలు విధించనున్నారు. ఈ 3 రోజుల పాటు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తోబుట్టువుల దేవతల దర్శనాన్ని భక్తులకు నిషేధించారు. సర్వేకు భక్తులు సహకరించాలని పూరీ ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ 3 రోజుల పాటు నిర్వహించనున్న సర్వే సమయంలో పూరీ ఆలయం ప్రధాన ద్వారాలను మూసివేయనున్నారు. ఆలయ రత్న భాండాగారంలో ఏదైనా రహస్య గది గానీ, సొరంగం గానీ ఉన్నాయా అనే విషయాలను ఈ సర్వే ద్వారా తేల్చనున్నట్లు రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు.
ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇక ఇప్పటికే రత్న భండార్‌లో మొదటి దఫా సర్వే పూర్తి చేశారు. సెప్టెంబర్ 18వ తేదీన తొలి సర్వే నిర్వహించగా.. అందులో 17 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా పూరీ రత్న భాండాగారంలో ప్రాథమిక ఇన్‌స్పెక్షన్ చేపట్టారు. ఈ టీంలో హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్, ఎన్జీఆర్ఐలకు చెందిన నిపుణులు ఉన్నారు.