Uttarakhand: ఘోర ప్రమాదం.. బస్సు లోయలోకి దూసుకెళ్లి 23 మంది మృతి

దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ప్రయాణీకులతో వెళ్తోన్న ఓ బస్సు అల్మోరా జిల్లాలోని మర్చులా వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. కుపి ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సు ఓవర్‌లోడ్‌ కారణంగానే అదుపుతప్పి లోయలో పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఎయిర్‌ లిఫ్ట్‌ చేయాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ ఘటనపై మెజిిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశించారు. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ధామి వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం రామ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించనున్నారు. కాగా, ప్రమాద సమయానికి బస్సులో 40 మందికిపైగా ఉన్నట్టు తెలుస్తోంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం.. కొండ ప్రాంతం కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఘటనా స్థలిలోనే 20 మంది మృతిచెందారు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే, వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. వీరంతా సమీప ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. పోస్ట్‌మార్టం అనంతరం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

About amaravatinews

Check Also

76వ గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు.. భారత్‌లో 3 రోజుల పర్యటన

2025, జనవరి 26 ఆదివారం జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *