శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా బాబూ.. అని తలలు పట్టుకుంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అయితే శేఖర్ బాషా ఎలిమినేషన్‌కి బలమైన కారణమే ఉంది. ఆ విషయాన్ని నేరుగా హౌస్‌లోనే ప్రకటించారు హోస్ట్ నాగార్జున. శేఖర్ బాషా భార్య నిండు గర్భిణిగా ఉండగా.. శనివారం ఉదయం ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ విషయాన్ని శేఖర్ బాషాకి చెప్పగా.. అతను చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది శనివారం నాటి ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. ఈ కారణంగానే శేఖర్ బాషాని ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హౌస్ నుంచి బయటకు వెళ్లాలంటా ఎలిమినేషన్ తప్పనిసరి. కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో శేఖర్ బాషాని హౌస్‌లో నుంచి ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు.
నిజానికి ఈవారంలో 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండగా.. ఆదిత్య ఓం, పృథ్వీ, సీత ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారంతా. అయితే శేఖర్ తండ్రి కావడంతో హౌస్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి.. ఈవారంలో ఎలిమినేషన్ కోటాని అతనితో పూర్తి చేయిస్తున్నారు. అలా ఈవారంలో డేంజర్ జోన్‌లో ఉన్న ఆదిత్య ఓం, పృథ్వీలు సేవ్ అయిపోయినట్టే.
అయితే.. శేఖర్ బాషా భార్య, కొడుకు క్షేమంగానే ఉండటంతో తిరిగి అతను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. నిజానికి గత సీజన్‌లో 30 ఎపిసోడ్‌ల తరువాత ఐదుగురు కంటెస్టెంట్స్‌ని బిగ్ బాస్ 2.0 ద్వారా వైల్డ్ కార్డ్‌లతో హౌస్‌లోకి పంపారు. ఇప్పుడు శేఖర్ బాషాని ఎలిమినేట్ చేసినా కూడా.. వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు శేఖర్ బాషా తన వ్యక్తిగత కారణం చేత హౌస్ నుంచి వెళ్తున్నాడు కాబట్టి.. అతనికి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.