బాల్యంలో పిల్లలకు చదువు మీది కంటే ఆటలపైనే శ్రద్ధ ఎక్కువ. సండే ఎప్పుడోస్తుందా.. దోస్తులతో రోజు మొత్తం క్రికెట్ ఆడుకుందామా అని ఎదురుచూస్తుంటారు. అయితే.. విద్యార్థులకు చదువూ ముఖ్యమే.. అటు ఆటలూ అవసరమే. కానీ ఇప్పుడున్న విద్యావ్యవస్థ, తల్లిదండ్రుల ఒత్తిడితో.. చాలా మంది పిల్లలను బట్టి చదువులకు అలవాటుపడుతూ.. ఆటలకు దూరమవుతున్నారు. దీంతో.. కొంతమంది పిల్లలు తమకు ఇష్టమైన ఆటలు ఆడుకోలేక.. తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో వెళ్లనివ్వక.. తాము పెట్టుకున్న లక్ష్యాలకు ప్రోత్సాహం దొరకక తమలో తామే ఒత్తిడికి గురవుతున్నారు. అలా మథన పడిన ఓ విద్యార్థి.. తమ తల్లిదండ్రులకు లేఖ రాసిపెట్టి.. ఇంట్లో నుంచి వెళ్లిపోవటం ఇప్పుడు పేరేంట్స్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఓ బాలుడు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పోతూ పోతూ తన మనోగతాన్ని లేఖ రూపంలో తన తల్లిదండ్రులకు తెలియజేశారు. ఓవైపు తన తల్లిదండ్రులు తనపై చూపే శ్రద్ధను చెప్తూనే, క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని కూడా వివరించాడు. అయితే.. చదువే సర్వస్వం.. చదువుకుంటే బాగుపడతావంటూ మంచి మాటలు చెప్తున్నారు సరే కానీ.. తనకు క్రికెట్ మీద ఉన్న ఆసక్తిని గుర్తించట్లేదని.. తాను ఓ గొప్ప క్రికెటర్ అవ్వాలని పెట్టుకున్న లక్ష్యంవైపు ప్రోత్సహించట్లేదన్న విషయాన్ని చాలా సున్నితంగా చెప్పుకొచ్చిన తీరు.. అందరినీ ఆలోచనలో పడేస్తోంది.