తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్టీకి కార్యకర్తలే బలమని.. వారి త్యాగాలను మర్చిపోలేమన్నారు. ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, గ్రామ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ..వ్యవస్థలను మళ్లీ తిరిగి గాడిలో పెడుతున్నామన్నారు. కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని.. టీడీపీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. అలాగే కార్యకర్తలకు ప్రమాద బీమాను రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.. సభ్యత్వ నమోదు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలు స్వతహాగా ఎదిగేలా ఎంపవర్‌మెంట్ చేస్తామన్నారు.
నాటి పాపాలే నేడు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు చంద్రబాబు. ప్రజల సెంటిమెంట్ తోనూ ఆడుకునే స్థాయికి గత పాలకులు దిగజారారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో దోషులను వదలబోమన్నారు. నేరం చేయడం, తప్పించుకోడానికి ఎదురుదాడి చేయడం అలవాటుగా మారిందని.. ఇలానే వదిలేస్తే అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మోసం చేస్తారన్నారు. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతను తీవ్ర నిరాశలో కూరుకుపోయేలా చేశారని.. ఎన్నికల హామీలో ఇచ్చిన మేరకు తొలిసంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై పెట్టామని గుర్తు చేశారు.