తిరుపతి లడ్డూ తయారీ గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తాజాగా మరిన్ని విషయాలు వెల్లడించారు. శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారాన్ని ఆయనే తనతో చెప్పించారని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. ఇక నుంచి భవిష్యత్తులో ఇలాంటి కల్తీ ఘటనలు జరగకుండా.. తప్పు చేసినవారిని కఠినంగా శిక్షిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఈ విషయం విని తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారని వెల్లడించారు. మరోవైపు.. తిరుమలలో జరిగిన ఇంతటి భారీ అపచారానికి సంబంధించి వివిధ వర్గాల వారితో మాట్లాడనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం తప్పులు, పాపాలు చేసి మళ్లీ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
తిరుమల ఆలయాన్ని సంప్రోక్షణ చేయడం గురించి జీయర్లు, కంచి పీఠాధిపతులు, ఇతర ధర్మాచార్యులు, పండితులతో మాట్లాడతామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్ హయాంలో రాముడి విగ్రహం తల తీసేసినా, ఆలయాలపై దాడి చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారని మండిపడ్డారు. తప్పులు, పాపాలు చేసి.. మళ్లీ సిగ్గు లేకుండా జగన్ వాటిని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భాగం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీలో నాణ్యతను పరీక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు.