హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్టేషన్ల నుంచి వివిధ రాష్ట్రాలకు ప్రధాన ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక నగర శివార్లలోని చర్లపల్లి వద్ద రూ.415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తోంది. ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ల సేవలందించేకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుంటగా.. పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. తర్వలోనే స్టేషన్ ప్రారంభం కానుండగా.. తాజాగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
నాలుగు రోజుల క్రితం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈ టర్మినల్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. చర్లపల్లి రైల్వే టెర్మినల్స్ కోసం రోడ్ల విస్తరణ పనులకు సహకారం అందించాలని లేఖలో కోరారు. ఈ మేరకు రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున.. స్టేషన్ ముందు పార్కింగ్, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్‌కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని సూచించారు.