రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తాయి. దీంతో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల ప్రజలు ముంపు బాధితులుగా మిగిలారు. భారీ వరదలకు ఇల్లు వాకిలి కొట్టుకుపోయి నిరాశ్రయులుగా మారారు. దీంతో వారిని అదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు.
తాజాగా.. వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సాయం ప్రకటించారు. వరద బాధితుల కోసం ఎమ్మెల్సీగా తనకు వచ్చే ఒక నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వచ్చిన వరదల కారణంగా దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ మూడు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిందని అన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉండటం విచారకరమన్నారు.
వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా తనకు వచ్చే నెల జీతం 2.75 లక్షలు సీఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వరద భాదితులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని.. ముంపు బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. మిగిలిన ప్రజా ప్రతినిధులు, మంత్రులు కూడా తమ నెల జీతాన్ని విరాళంగా ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలని మల్లన్న రిక్వెస్ట్ చేశారు. ఈ కష్ట సమయంలో వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు.