బెట్టింగులకు బానిసై రూ.2.40 కోట్లు అప్పు చేసిన కుమారుడు.. తీర్చలేక తల్లిదండ్రుల బలవన్మరణం

ఒక్కగానొక్క కొడుకని అల్లారుముద్దుగా పెంచారు. అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చారు. వంశాన్ని నిలబెట్టే వారసుడని.. తమను పున్నామ నరకం నుంచి గట్టెక్కించే పుత్రుడని ఆశలు పెంచుకున్నారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. అతి గారాబమే తమ పాలిట మృత్యుపాశమవుతుందని.. కన్న కొడుకే తమ చావుకు కారణమవుతాడని.. పాపం ఆ వెర్రి తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. మంచి చదువులు చదివించి ప్రయోజకుడిని చేద్దామని భావించిన ఆ కన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. చిన్నప్పటి నుంచి గారబంగా పెరిగిన ఆ కొడుకు.. వ్యసనాలకు బానిసయ్యాడు. బెట్టింగులకు బానిసగా మారి కోట్ల రూపాయలు అప్పులు చేశారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక.. పాపం కన్నోళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి, ప్రశాంతిలకు నిఖిల్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కొడుకును గారాబంగా పెంచిన ఆ దంపతులు.. డిగ్రీ చేస్తానంటే బెంగళూరుకు పంపారు. కొడుకు మంచిగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడని.. తమను ఉద్ధరిస్తాడని ఆశించారు. అడిగినప్పడల్లా డబ్బులు పంపుతూ వచ్చారు. అయితే నిఖిల్ రెడ్డి దారితప్పాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. కోట్లల్లో అప్పులు చేశాడు. దాదాపుగా రూ.2.40 కోట్లు అప్పులు చేసినట్లు తెలిసింది. ఈ విషయం ఇంట్లో తెలిసింది. అయితే ఒక్కగానొక్క కొడుకు కావటంతో ఆ తల్లిదండ్రులు కొడుకు చేసిన అప్పులను తీర్చేందుకు ప్రయత్నించారు.

ఊర్లో ఉన్న పదెకరాల భూమిని, ఇంటిని, పొలాన్ని ఇలా అన్నీ అమ్మేశారు. అయితే అప్పులు తీరలేదు. మిగతా అప్పు తీర్చాలంటూ అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో మిగిలిన మూడు ఎకరాల భూమిని కూడా అమ్మేయాలని మహేశ్వరరెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే మరీ తక్కువ ధరకు అడుగుతూ ఉండటంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో .. పరువు పోతుందనే భయంతో మహేశ్వర్ రెడ్డి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పొలంలోకి వెళ్లి పురుగులు మందు తాగి ఆ దంపతులు ఇద్దరూ తనువు చాలించారు. బుధవారం తెల్లవారుజామున పొలాలకు వెళ్లిన రైతులు.. ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులోనే నిఖిల్ రెడ్డి అప్పులు వ్యవహారం గురించి బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసిన స్థానికులు.. ఒక్కగానొక్క కొడుకుని అల్లారుముద్దుగా పెంచితే కొడుకు వ్యసనమే.. ఆ తల్లిదండ్రుల పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

About amaravatinews

Check Also

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…

జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్ ఎపిసోడ్‌ ఇప్పుడు పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్‌ను పార్టీ కార్యక్రమాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *