భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో మొత్తం నీటమునిగి అస్తవ్యస్తం అయ్యాయి. ఇక ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న జనం.. తిండి, తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి.. వరద బాధితులకు సహాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫార్మా కంపెనీ అయిన దివీస్ ల్యాబ్స్ కూడా రంగంలోకి దిగింది. భారీ వరదలతో అతలాకుతలం అయిన బెజవాడ నగరానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే విజయవాడ నగరంలోని వరద బాధితులకు ఆహారం అందించాలని నిర్ణయించింది. 5 రోజుల పాటు వరద బాధితులకు తమ సంస్థ ఆహారం అందించనున్నట్లు దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ఎండీ మురళీకృష్ణ తాజాగా వెల్లడించారు.
ఈ ప్రకృతి విపత్తు సమయంలో విజయవాడ వరద బాధితులకు దివీస్ సంస్థ చేయూతను అందిస్తోంది. 5 రోజుల పాటు వరద బాధితులకు ఆహారం సరఫరా చేస్తామని ప్రకటించింది. నిత్యం విజయవాడ నగరంలోని 1.70 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తామని తెలిపింది. అక్షయపాత్ర ద్వారా వరద బాధితులకు ఆహారం అందిస్తున్నట్లు దివీస్ ఎండీ మురళీకృష్ణ స్పష్టం చేశారు. సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో 5 రోజులపాటు ఈ సాయం కొనసాగుతుందని మురళీకృష్ణ వెల్లడించారు.