Spot Rs 500 Rupee Note Fake: 2016 నవంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి.. రూ. 2 వేలు విలువైన నోటును చలామణీలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత మరో కొత్త డిజైన్‌లో రూ. 500 నోటు తీసుకొచ్చింది. ఇక గతేడాది రూ. 2000 బ్యాంక్ నోట్లను కూడా ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటికీ జనం తమ దగ్గర ఉన్న ఈ కరెన్సీ నోట్లను ఆర్బీఐకి సమర్పిస్తున్నారు. దీంతో రూ. 2 వేల నోట్ల చలామణీ తగ్గగా.. ప్రస్తుతం రూ. 500 నోటే మళ్లీ పెద్ద ఎత్తున చలామణీలో ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే నకిలీ నోట్లు కూడా పెరిగిపోతున్నాయట. ముఖ్యంగా గత 5 సంవత్సరాలలో ఈ విలువ కరెన్సీలో నకిలీ నోట్ల సంఖ్య ఏకంగా 317 శాతం పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా పార్లమెంటులో రిపోర్ట్ సమర్పించింది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో 21,865 మిలియన్లుగా ఉన్న రూ. 500 నకిలీ నోట్లు.. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 91,110 మిలియన్లకు చేరిందని డేటాలో వెల్లడైంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 15 శాతం తగ్గింది. ఓవరాల్‌గా మాత్రం 317 శాతం నకిలీ నోట్లు పెరిగాయి.
ముఖ్యంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే (కొవిడ్ సమయంలో) ఈ దొంగ నోట్ల చలామణీ ఎక్కువైందని తెలిపింది. 2020-21లో 39,453 మిలియన్లుగా ఈ సంఖ్య ఉండగా.. అది మరుసటి ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 79,669 మిలియన్లకు చేరింది. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 102 శాతం పెరిగింది. 2022-23తో పోలిస్తే 2023-24లో రూ. 2 వేల నకిలీ నోట్లు కూడా 166 శాతం పెరిగాయి. ఈ పెద్ద నోట్ల నకిలీలు పెరిగినప్పటికీ.. ఓవరాల్‌గా మాత్రం అన్ని కరెన్సీ నోట్లకు సంబంధించి 30 శాతం తగ్గుదల నమోదైంది.
రూ. 500 నోటు నకిలీదో, అసలైనదో తెలుసుకునేందుకు కొన్ని పరిశీలించాల్సి ఉంటుంది. దీని గురించి తెలుసుకుందాం. ముందుగా సెక్యూరిటీ థ్రెడ్ కరెన్సీ నోటులోని ఒక నిలువు గీత. ముందుగా చూస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఈ గీత.. నోటు వంచి చూసినప్పుడు థిక్ బ్లూ (ముదరు నీలం) రంగులోకి మారుతుంది. గీత రంగు మారకుంటే అసలైనది కాదు.