Intrest Rates: ప్రస్తుతం బ్యాంకులు వసూలు చేస్తున్న అధిక వడ్డీ రేట్ల వల్ల లోన్లు తీసుకున్న ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రుణాలపై వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకులకు సూచించారు. కేంద్ర మంత్రి సూచన మేరకు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దీంతో రుణగ్రహీతలపై భారం తగ్గనుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంకులకు సూచించారు.
‘ దేశంలో పరిశ్రమలు మరింత వృద్ధి చెందాలి. కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు అవసరం. రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరం అవుతుంది. దేస వృద్ధి రేటు పెరిగేందుకు మాకు పలు సూచనలు వచ్చాయి. రుణ వ్యయాలు తగ్గించాలని పలువురు కోరారు. దేశంలో పరిశ్రమలు వృద్ధి చేందాలంటే వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం గణాంకాలను 3-4 కమోడిటీలు నిర్దేశిస్తున్నాయి. మిగిలినవన్నీ 3-4 శాతం స్థాయిలోనే ఉంటున్నాయి. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణ సూచీలో పరిగణించాలా వద్దా అన్న చర్చలో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు.’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
సరఫరా సమస్యలపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించిందని, ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండకుండా నివారించేందుకు, సరకుల నిల్వ సదుపాయాలు పెంచుతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక వృద్ధి మందగమనం చోటు చేసుకుంటోందన్న అంచనాలపై మాట్లాడారు. దేశీయ, అంతర్జాతీయ సవాళ్ల గురించి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు. అయితే, అనవసరంగా ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు.