ఏపీలో మొదలైన తిరుపతి లడ్డూ వ్యవహారం క్రమంగా పక్క రాష్ట్రానికి కూడా పాకుతోంది. ఇప్పటి వరకూ వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిగా ఉన్న వ్యవహారం క్రమంగా తెలంగాణ బీజేపీ వర్సెస్ వైసీపీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల అపవిత్రమైందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేత మాధవీలత ఇటీవల తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు. రైళ్లో భజన చేసుకుంటూ మాధవీలత తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలోనే మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైఎస్ జగన్ సర్కారు ప్రవర్తించిందని మండిపడ్డారు. తిరుమలలో కల్తీ నెయ్యి బయటపడితే ప్రాయశ్చిత్తం ఎందుకు చేయలేదని ప్రశ్నించిన మాధవీలత.. వైఎస్ జగన్ తిరుమలకు వెళ్తే తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే జగన్‌ను తిరుమలకు వెళ్లనివ్వకూడదని.. కొండ కిందే ఆపేయాలంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే మాధవీలత వ్యాఖ్యలకు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మాధవీలత పక్క రాష్ట్రం నుంచి భజన చేసుకుంటూ తిరుమలకి వచ్చారని.. అది దిక్కుమాలిన తనమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భజన చేయాలనుకుంటే తన ఆస్పత్రిలో చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు. మాధవీలత ఆస్పత్రిలో ఒక్క రోగికైనా ఫీజు తగ్గించారా అంటూ మాధవీలతపై విమర్శనాస్త్రాలు సంధించారు. మాధవీలతకు ఆంధ్రప్రదేశ్‌కు ఏం సంబంధం ఉందన్న పేర్ని నాని.. ఇక్కడి హిందువులు, మతం గురించి ఆమె మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు వెళ్తే.. ఆయనను డిక్లరేషన్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ రోజు మాట్లాడుతున్న నేతల నోరు.. ఆ రోజు ఏమైందంటూ పేర్ని నాని ఘాటుగా రియాక్టయ్యారు.