సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆదివారం (అక్టోబర్ 13న) రోజు రాత్రి సమయంలో ఆలయంలో నుంచి శబ్దం రావటంతో మేల్కొన్న స్థానికులు.. పారిపోతున్న ముగ్గురు దుండగుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. పారిపోయిన వారికోసం గాలింపు చేపట్టారు. అయితే.. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా.. ఓ దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా ఉంది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో.. హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న హిందూ సంఘాల కార్యకర్తలు, బీజేపీ నేతలు.. ముత్యాలమ్మ ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయం ఘటనలు చోటుచేసుకోకుండా.. ఘటనాస్థలిలో పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ క్రమంలోనే.. కేంద్ర కిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.