కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతవారం లక్నోలోని హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగి సదాఫ్ ఫాతిమా అనే మహిళ బ్యాంకులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అలాగే, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో ఛార్టెట్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ అధిక పని భారంతో మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా, ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన కార్యాలయం వాష్‌రూమ్‌లోనే గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని హెచ్‌సీఎల్ (HCL)లో పనిచేస్తున్న 40 ఏళ్ల సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆఫీసులోని వాష్‌రూమ్‌కు వెళ్లాడు. కానీ, కాసేపటి తరువాత సహోద్యోగులు లోపలికి వెళ్లి చూడగా కింద పడిపోయి ఉన్నాడు. దీంతో ఆందోళనకు గురైన సహచరులు.. వెంటనే క్యాంపస్ క్లినిక్‌కు తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తరలించారు.
అయితే, ఆస్పత్రికి చేరుకునేసరికి నితిన్ మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తు మృతిగా పోలీసులు కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు. సోనెగావ్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, గుండెపోటు కారణంగానే చనిపోయినట్టు ప్రాథమిక పరీక్షలో తేలిందని చెప్పారు. కేసు నమోదుచేసి.. అతడి మృతికి సంబంధించిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. నితిన్ మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.
మరణానికి కూడా పని ఒత్తిడి కారణం కావచ్చు.. అదే కోణంలోనూ దర్యాప్తు చేస్తాం’ అని పోలీస్ అధికారి తెలిపారు. ఉద్యోగి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని, సహాయం అందిస్తామని హెచ్‌సీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, చార్టెట్ అకౌంటర్ సెబాస్టియన్ మరణవార్త అందర్నీ కంటతడి పెట్టించింది. ఆమె చనిపోతే కంపెనీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా చూసేందుకు రాలేదని ఆమె తల్లి రాసిన లేఖ ఆవేదనకు గురిచేసింది.