హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా విలయం.. నగరం అతలాకుతలం..!

హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు.

చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, సనత్ నగర్, బోరబండ, శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్ పల్లి, లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, అల్వాల్, పటాన్‌చెరు, ఆర్సీపురం, అమీన్‌పూర్, మాదాపూర్, హైటెక్‌సిటీలో వర్షం దంచి కొడుతోంది. చాలా సేపటి నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో.. రోడ్లపై వరద నీరు ఉప్పొంగుతోంది. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు.

భారీ వర్షం కారణంగా.. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించారు. రోడ్లపై ఉన్న వాళ్లు.. జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని.. ఏ అవసరం వచ్చిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

మరోవైపు.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెండ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కన ఉన్న జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలంతా ఈ కుండపోత వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ భారీ వర్షం మరో గంట నుంచి రెండు గంటల పాటు కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. అత్యవసరమైతే 040-21111111/9000113667 నెంబర్‌కి ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

About amaravatinews

Check Also

తెలంగాణలో తొలి జీబీఎస్‌ మరణం.. సిద్దిపేట జిల్లాకు చెందిన 25 ఏళ్ల వివాహిత మృతి

ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జీబీఎస్‌. ఇది ఒక నరాల వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *