FD Rates: స్థిరమైన రాబడి పొందాలనుకునే వారికి వెంటనే గుర్తుకు వచ్చేది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits). ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేని రాబడిని అందించే మదుపు మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో డిపాజిట్లను పెంచుకునేందుకు బ్యాంకులు సైతం మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా 60 ఏళ్ల వయసు లోపు ఉండే జనరల్ కస్టమర్లకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తూ.. 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. దాదాపు అన్ని బ్యాంకుల్లో ఇదే అనుసరిస్తుంటారు. అయితే, సీనియర్ సిటిజన్లకు అందే మాదిరిగా వడ్డీ రేట్లు పొందేందుకు మంచి అవకాశం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల వంటి పెద్ద పెద్ద బ్యాంకులు ఇవ్వని విధంగా జనరల్ కస్టమర్లకే ఈ బ్యాంకులు 9 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి.
అలా జనరల్ కస్టమర్లకు 9 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్న 5 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో అగ్రస్థానంలో ఉంది నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మూడేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ గల డిపాజిట్లపై ఈ బ్యాంక్ జనరల్ కస్టమర్లకు 9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.5 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీ తర్వత అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 6,33,300 వరకు అందుతాయి.