రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. ఆ పైన లోన్ ఉన్న వారి పరిస్థితేంటి..?

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైంది రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని.. వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లోనూ ఇదే ప్రధానమైన హామీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. మెుత్తం మూడు విడతల్లో ఈ హామీ అమలైంది. మూడో విడతలో భాగంగా రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రైతులకు మాఫీ వర్తింప జేశారు. ఆగస్టు 15న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రైతులకు చెక్కులు అందజేశారు.

అయితే ఆగస్టు 15న బ్యాంకులకు సెలవు దినం కావటంతో..రైతు రుణమాఫీ పథకం కింద పలువురికి ఆగస్టు 16 నుంచి నిధుల జమ మొదలైంది. నిధుల జమపై కొందరు రైతులకు ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. రూ.2 లక్షల్లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ అయ్యాయి. ప్రస్తుతం రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్నవారికి మాత్రమే మాఫీ వర్తింప జేసారు. ఆ పైన ఒక్కరూపాయి అదనంగా లోన్ తీసుకున్నా.. మాఫీ వర్తింప చేయలేదు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాత.. రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం ముందుగా నిర్దేశించింది.

ఉదాహరణకు ఒక రైతు బ్యాంకులో రూ. రెండున్నర లక్షల రుణం తీసుకుంటే.. రూ. 50 వేలు రైతు ముందుగా బ్యాంకు రుణం తీర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన రూ. 2 లక్షలకు ప్రభుత్వం రైతు రుణమాఫీ వర్తింపజేస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన తాజా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ అయినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు. రూ. 2 దాటిన వారికి ఎప్పుడు చెల్లించాలనే దానిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.

కాగా, రూ.2 లక్షల రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం మెుత్తం రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే అర్హతలు ఉన్నప్పటికీ కొందరు రైతులకు ఇంకా రైతు రుణమాఫీ కాలేదు. అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం రేవంత్ వెల్లడించారు. ఆయా రైతులు కలెక్టరేట్లకు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు అన్ని పరిశీలించి వారికి రైతు రుణమాఫీ వర్తింప జేస్తారని స్పష్టం చేశారు.

About amaravatinews

Check Also

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు..!

రాధాకిషన్‌రావుకు హైకోర్టు, తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండీషన్ బెయిల్‌ ఇచ్చిందని.. ఈ క్రమంలో సంవత్సర కాలంగా చంచల్‌గూడా జైలులో రిమాండ్‌ ఖైదీగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *