ఏపీని వణికిస్తున్న వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌‌ను వర్షాలు వణికిస్తున్నాయి.. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా వానలు ఊపందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.. ఇప్పటికే మరో అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో రెండో అల్పపీడనం మరింత బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు విస్తాయంటున్నారు.

ఇవాళ ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఏపీ విపత్తుల సంస్థ. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు సూచిస్తున్నారు.

ఇటు రాష్ట్రంలో వర్షాలు, వరద ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఏలూరు కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సూచనలు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని.. పశుసంపదకు నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. పంటనష్టం నివారించాలని సూచించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరద ప్రవహించే వాగులు, కాలువలను ప్రజలు దాటే ప్రయత్నం చేయొద్దని.. వానలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. అందుకే పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు- గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దంటున్నారు.

మరోవైపు గోదావరికి వరద పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీళ్లను విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడటంతో కొన్ని కాలనీలు ముంపుబారిన పడ్డాయి. తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో దాదాపు 7,400 ఎకరాలు మునిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కోనసీమ జిల్లాలో నారుమడులు మునిగిపోయాయి. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్షలు చేశారు.

ఇటు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వాగులు, వంకలు పొంగాయి. కుక్కునూరు మండలంలో పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. దిగువ గ్రామాలతో పాటుగా వేలేరుపాడు మండలానికి రాకపోకలు ఆగిపోయాయి. కుక్కునూరు-అశ్వారావుపేట రోడ్డులో వాహనాలు ఆగిపోయాయి.. అక్కడ చెట్టు పడిపోయింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరదతో అధికారులు మండలాల్లోనే ఉండాలనీ, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో గండి పోశమ్మ ఆలయాన్ని ముంచెత్తింది. వరదతో నదీ తీరంలోని అమ్మవారి ఆలయం చుట్టూ భారీగా నీరు చేరడంతో.. అమ్మవారి విగ్రహం మునిగిపోయింది. అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి దర్శనాల్ని నిలిపేశారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ ఎగువ కాఫర్‌ డ్యాం దగ్గర గోదావరి వరదతో పరవళ్లు తొక్కుతోంది. పాపికొండల విహారయాత్రనూ జల వనరుల శాఖ అధికారులు నిలిపేశారు.. పోశమ్మగండి నుంచి దండంగి వరకు పలుచోట్ల రోడ్డుపైకి వరద నీరు చేరింది.

About amaravatinews

Check Also

దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు.. YCP ఎంపీ కొత్త డిమాండ్..!

పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి తెరమీదకు తీసుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *