చంద్రయాన్-3 ప్రయోగానికి ఏడాది.. ఇస్రో కీలక నిర్ణయం

సరిగ్గా ఏడాది కిందట ఆగస్టు 23న సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చంద్రయాన్-3ను దింపి భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ దేశానికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. రెండు వారాల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించిన ల్యాండర్ విక్రమ్.. రోవర్ ప్రజ్ఞాన్‌లు కీలక సమాచారాన్ని సేకరించాయి. ఈ డేటాను విశ్లేషణ కోసం తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. దక్షిణ ధ్రువంపై శివశక్తి పాయింట్‌ వద్ద ల్యాండర్ దిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇస్రో ఈ చర్య చేపట్టింది. విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌లోని ఐదు సైన్స్‌ పరికరాలు సేకరించిన మొత్తం 55 గిగాబైట్ల డేటాను వైబ్‌సైట్‌లో పెట్టింది.

‘చంద్రయాన్-3 కోసం పనిచేసి.. ఆయా పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ డేటాను పరిమితం చేయడంలేదు.. దేశ, విదేశాల్లోని పరిశోధకులకు దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం.. దీనివల్ల మరింత మెరుగైన ఫలితం ఉంటుంది’’ అని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. ఇండియన్‌ స్పేస్‌ సైన్స్‌ డేటా సెంటర్‌ (ఐఎస్‌ఎస్‌డీసీ)కి చెందిన www.pradan.issdc.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి ఈ డేటాను పొందవచ్చని పేర్కొన్నారు.

ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై ఇన్-సిటు రసాయన విశ్లేషణలను నిర్వహించింది. ఇది చంద్రుని పుట్టుక, పరిణామంపై మెరుగైన అవగాహనకు దోహదపడింది. భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలు, సంభావ్య వనరుల వినియోగానికి ఈ సమాచారం ఎంతో కీలకం. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు.. చంద్రయాన్-3 నుంచి డేటాను విశ్లేషించారు. అతిపెద్ద శిలాద్రవం చల్లబడటం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడనే శాస్త్రవేత్తల ప్రాక్కల్పనకు ఈ డేటా ఆధారాలను అందించినట్టు గుర్తించారు.’

చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై దిగిన ఆగస్టు 23ను ఏటా నేషనల్ స్పేస్ డేగా పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తొలి స్పేస్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు పెద్దసంఖ్యలో పెద్ద సంఖ్యలో రోదసీలోకి ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నందువల్ల అంతరిక్షంలో శకలాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2030కల్లా శకలాలకు తావులేని విధంగా ప్రయోగాలు నిర్వహించేలా ఇస్రో లక్ష్యంగా పెట్టుకోవడం ప్రశంసనీయమని ఆమె అన్నారు.

About amaravatinews

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *