సరిగ్గా ఏడాది కిందట ఆగస్టు 23న సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చంద్రయాన్-3ను దింపి భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ దేశానికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. రెండు వారాల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించిన ల్యాండర్ విక్రమ్.. రోవర్ ప్రజ్ఞాన్‌లు కీలక సమాచారాన్ని సేకరించాయి. ఈ డేటాను విశ్లేషణ కోసం తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. దక్షిణ ధ్రువంపై శివశక్తి పాయింట్ వద్ద ల్యాండర్ దిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇస్రో ఈ చర్య చేపట్టింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లోని ఐదు సైన్స్ పరికరాలు సేకరించిన మొత్తం 55 గిగాబైట్ల డేటాను వైబ్‌సైట్‌లో పెట్టింది.
‘చంద్రయాన్-3 కోసం పనిచేసి.. ఆయా పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ డేటాను పరిమితం చేయడంలేదు.. దేశ, విదేశాల్లోని పరిశోధకులకు దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం.. దీనివల్ల మరింత మెరుగైన ఫలితం ఉంటుంది’’ అని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ (ఐఎస్‌ఎస్‌డీసీ)కి చెందిన www.pradan.issdc.gov.in అనే వెబ్‌సైట్ నుంచి ఈ డేటాను పొందవచ్చని పేర్కొన్నారు.
ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై ఇన్-సిటు రసాయన విశ్లేషణలను నిర్వహించింది. ఇది చంద్రుని పుట్టుక, పరిణామంపై మెరుగైన అవగాహనకు దోహదపడింది. భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలు, సంభావ్య వనరుల వినియోగానికి ఈ సమాచారం ఎంతో కీలకం. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు.. చంద్రయాన్-3 నుంచి డేటాను విశ్లేషించారు. అతిపెద్ద శిలాద్రవం చల్లబడటం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడనే శాస్త్రవేత్తల ప్రాక్కల్పనకు ఈ డేటా ఆధారాలను అందించినట్టు గుర్తించారు.’
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై దిగిన ఆగస్టు 23ను ఏటా నేషనల్ స్పేస్ డేగా పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తొలి స్పేస్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు పెద్దసంఖ్యలో పెద్ద సంఖ్యలో రోదసీలోకి ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నందువల్ల అంతరిక్షంలో శకలాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2030కల్లా శకలాలకు తావులేని విధంగా ప్రయోగాలు నిర్వహించేలా ఇస్రో లక్ష్యంగా పెట్టుకోవడం ప్రశంసనీయమని ఆమె అన్నారు.