తీవ్ర జనాభా సంక్షోభంలో చైనా.. వేలాది స్కూల్స్ మూసివేత

ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం అమలు చేసిన కఠిన నిబంధనలు ఇప్పుడు చైనా పాలిట శాపంగా మారాయి. ఎన్నడూ లేని తీవ్ర జనాభా సంక్షోభాన్ని డ్రాగన్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం విద్యతోపాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. జననాల రేటు గణనీయంగా తగ్గడంతో చైనా వ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 2023లో 14,808 కిండర్‌ గార్టెన్లు (Kindergartens) మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11.55 శాతం (5.35 మిలియన్లు) తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది. మొత్తం 274, 400 కిండర్‌గార్టెన్లు ఉండగా.. ప్రస్తుతం 259,592 మాత్రమే పనిచేస్తున్నాయని నివేదిక వివరించింది.

అటు, ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించిందని, దేశంలో 2023లో 5,645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఇక, వరుసగా రెండో ఏడాది పడిపోయి చైనా జనాభా ప్రస్తుతం 140 కోట్లకు చేరుకుంది. గతేడాది జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు తగ్గినట్టు అంచనా. ఏడు దశాబ్దాల తర్వాత 2023లో జననాల రేటు అత్యల్పంగా నమోదయ్యింది. గతేడాది కేవలం 90 లక్షల జననాలు మాత్రమే నమోదుకావడం గమనార్హం.

జనాభా పరంగా రెండు సంక్షోభాలతో చైనా సతమతమవుతోంది. ఓవైపు జననాల, సంతానోత్పత్తి రేట్లు పడిపోగా…. మరోవైపు వృద్ధుల జనాభా పెరిగిపోతుంది. 2023 నాటికి 60ఏళ్లు పైబడిన జనాభా 30 కోట్లకు చేరుకోగా.. 2035 నాటికి ఈ సంఖ్య 40కోట్లు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్‌గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆ పాఠశాలల్లో సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో జనాభా నియంత్రణకు చైనా తీసుకొచ్చిన ‘ఒకరు లేక అసలు వద్దు’ అనే నినాదమే దుస్థితికి కారణం.

జననాల రేటు తగ్గిపోవడంతో 2016లోనే ఈ విధానాన్ని చైనా రద్దుచేసింది. ప్రతి జంట కనీసం ఇద్దరు పిల్లలను కనొచ్చని సూచించింది. ఇది ప్రభావం చూపకపోవడంతో మళ్లీ 2021లో జనాభా విధానాన్ని సవరించింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఎక్కువ మంది పిల్లలను కనేందుకు విముఖత చూపడంతో వారికి ప్రోత్సహాకాలు కూడా ప్రకటించింది. వృద్ధుల పెరిగిపోతుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది. కొన్ని రాష్ట్రాలు సైతం పెళ్లిళ్లు చేసుకోవాలని, పిల్లలను కనాలని ప్రోత్సాహాలు అందజేస్తున్నాయి.

About amaravatinews

Check Also

అదంతా మోదీ క్రెడిటే.. భారత ప్రధానిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో.. భారతదేశం సాంకేతికత, మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆవిష్కరణలతో సహా అనేక రంగాలలో గణనీయమైన పురోగతిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *