బిగ్ బీ అమితాబచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’పరిచయం అక్కర్లేని టీవీ షో. టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షోల్లో ఒకటైన కేబీసీకి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ షో 16వ సీజన్ నడుస్తోంది. ఆగస్టు 12 నుంచి మొదలైన ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఎవరూ రూ.కోటి గెలుచుకోలేదు. తాజాగా, 22 ఏళ్ల యువకుడు చందర్ ప్రకాశ్ (Chander Prakash) రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి సంచలనం సృష్టించాడు. దీంతో ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడు. అయితే, చివరిదైన రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినా… అతడు రిస్క్ తీసుకోకుండా క్విట్ అయ్యాడు.
బుధవారం నాటి ఎపిసోడ్‌లో మొదటి 14 ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కంటెస్టెంట్ చందర్ ప్రకాశ్.. రూ.కోటి లభించే 15వ ప్రశ్నకు చేరుకున్నాడు. ‘ఓ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. ‘శాంతి నివాసం’ అనే అరబిక్ పేరుతో ఓ పోర్టును కలిగి ఉంది’ అని వ్యాఖ్యాత అమితాబ్ ప్రశ్న అడిగారు. దీని కింద ఎ. సోమాలియా, బి. ఒమన్, సి. టాంజానియా, డి. బ్రూనై నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఈ ప్రశ్నకు చందర్ ప్రకాశ్ లైఫ్‌లైన్ ఉపయోగించుకుని ‘డబుల్ డిప్’ ద్వారా ఆప్షన్ సి. టాంజానియాను ఎంచుకున్నాడు. అది సరైన సమాధానం కావడంతో రూ.కోటి గెలుచుకున్నట్లు బిగ్‌బీ ప్రకటించాడు.
వెంటనే షోలో ఉన్నవారంతా చప్పట్లతో అతడిని అభినందించగా. అమితాబ్ సీట్లో నుంచి లేచి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రూ.కోటితో పాటు ఓ కారును కూడా ప్రకాశ్ బహుమతిగా అందుకున్నాడు. తర్వాత ఇక, 16వది చివరిదైన రూ.7 కోట్ల ప్రశ్న స్క్రీన్‌పై వచ్చింది. ‘1587లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్ దంపతులను జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?’ అని అమితాబ్ ప్రశ్నించారు. దీనికి జవాబు తెలియకపోవడంతో పాటు అప్పటికే అన్ని లైఫ్‌లైన్లు వినియోగించుకోవడంతో తప్పనిపరిస్థితుల్లో షో నుంచి ప్రకాశ్ క్విట్ అయ్యాడు. అయితే, అమితాబ్ సరదాగా ఆ ప్రశ్నకు సమాధానం ఊహించమని అడిగారు. దీంతో అతడు ఆప్షన్ ఎ. వర్జనీయా డేర్ అని చెప్పగా.. అదే సరైన ఆన్సర్ అని బిగ్‌బీ తెలిపారు.
ఇక, జమ్మూ కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాశ్.. ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్దమవుతున్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని, పుట్టుకతోనే పేగులో పూడిక కారణంగా ఇప్పటివరకు ఏడు సార్లు సర్జరీ జరిగిందని చెప్పాడు. ఇప్పటికీ ఆ సమస్య ఉందని, ఎనిమిదోసారి శస్త్రచికిత్స చేయాల్సిందేనని వైద్యులు సూచించారని తెలిపాడు.
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ఆగస్టు 12 నుంచి కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 ప్రసారమవుతోంది. ఇక, కేబీసీ షో 2000లో మొదలైంది. ఒక్క 2007 సీజన్‌కు తప్ప ఇప్పటి వరకూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఉన్నారు. 2007 సీజన్‌కు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు. కానీ, ఆయన అంతగా ప్రభావం చూపలేకపోయారు. మళ్లీ బిగ్ బీనే తీసుకొచ్చారు.