ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న శుభవార్తను వినిపించింది. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని సంగంజాగర్లమూడిలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నాదెండ్ల మనోహర్.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభ తేదీపైనా క్లారిటీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హామీల విషయంలో వెనుకడుగు వేయరని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తామన్న నాదెండ్ల మనోహర్.. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటీ 40 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారన్న నాదెండ్ల మనోహర్.. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వంపై ఏడాదికి రూ.3000 కోట్లు భారం పడుతుందని చెప్పారు.
మరోవైపు ఏపీ కేబినెట్ అక్టోబర్ 23న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ఆమోదం తెలపనున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైనా చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాలవాసుల రుణాల రీషెడ్యూల్, పాలకమండళ్ల నియామకంలో చట్ట సవరణ వంటి విషయాలపైనా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే సీఎస్ అన్ని శాఖలకు లేఖలు కూడా రాశారు.