మళ్లీ రగులుతోన్న మణిపూర్.. మంత్రులు ఇళ్లకు నిప్పు.. సీఎం నివాసంపై దాడి

మరోసారి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నిరససలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఆందోళనలతో ఇంఫాల్‌ లోయ అట్టుడుకుతోంది. రాజకీయ నాయకుల నివాసాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఏకంగా సీఎం వ్యక్తిగత నివాసానికి నిప్పంటించే ప్రయత్నం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. వీరిలో మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అల్లుడు రాజ్‌కుమార్‌ సింగ్‌ నివాసం కూడా ఉంది. శనివారం సాయంత్రం బీరేన్ సింగ్ ఇంటిపైనా దాడికి యత్నించడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు.

అయినా సరే వారు వెనక్కి తగ్గలేదు. అతికష్టంతో వారిని అక్కడ నుంచి చెదరగొట్టారు. ఆ సమయంలో సీఎం బీరెన్ సింగ్.. ఇంట్లో లేరని అధికార వర్గాలు తెలిపాయి. ఆఫీసులో ఆయన సురక్షితంగా ఉన్నారని వెల్లడించాయి . పరిస్థితి చేజారడంతో పశ్చిమ ఇంఫాల్‌లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్‌ లోయ సహా ఏడు జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన మైతీ తెగకు చెందిన ఇద్దరు పిల్లలు, ఒక మహిళ సహా ఆరుగురు జిరి నదిలో శవాలై తేలడంతో తాజా నిరసన జ్వాలలకు కారణమైంది. శనివారం నాటి హింసాకాండపై స్పందించిన కేంద్రం.. శాంతిభద్రతల పునరుద్ధరణకు భద్రతా బలగాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

జిరిబామ్‌లోని బోకోబెరాలో కుకీ మిలిటెంట్లు కొందరు మహిళలు, పిల్లలను అపహరించారు. దీంతో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మిలిటెంట్లు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కుకీ మిలిటెంట్లు అపహరించి, దారుణంగా హత్య చేశారు. ముగ్గురి మృతదేహాలు శుక్రవారం రాత్రి నదీ సమీపంలో కనిపించాయి. ఈ నేపథ్యంలో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్‌లో శనివారం భారీ నిరసన చేపట్టారు. తమ వర్గం హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు, సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని విధిస్తున్నట్లు కేంద్రం గురువారం నాడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇంఫాల్‌ జిల్లాలోని సెక్మయ్‌, లాంసంగ్‌, లామ్‌లై, జిరిమామ్‌ జిల్లాలోని జిరిబామ్‌, కాంగ్మోక్పి జిల్లాలోని లైమాఖోంగ్‌, బిష్ణుపూర్‌ జిల్లాలోని మాయిరంగ్‌ ప్రాంతాలలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. అయితే, దీనిని వెనక్కి తీసుకోవాలని మణిపూర్ ప్రభుత్వం అభ్యర్ధించింది.

గతేడాది మే మొదటి వారంలో జాతుల మధ్య మొదలైన వైరం.. హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఇప్పటి వరకూ అల్లర్లలో 250 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 వేల మంది కనిపించకుండాపోయారు.

About amaravatinews

Check Also

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎన్ని పోస్టులున్నాయంటే?

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2025, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఎగ్జామినేషన్‌ 2025.. ఈ రెండు నోటిఫికేషన్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *