ఉత్తర్ ప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో భారీ చోరీ చోటుచేసుకుంది. రామమందిర సమీపంలోని భక్తిపథ్, రామ్ పథ్‌లో ఏర్పాటుచేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొజెక్టర్ లైట్స్‌తో పాటు వేలాది వెదురు బొంగులు చోరీకి గురయినట్టు తెలిపిన పోలీసులు.. వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత భద్రత ఉండే అయోధ్యలోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దాదాపు 4 వేల లైట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. ఈ ఘటనపై రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆగస్టు 9వ తేదీన కేసు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు.
లైటింగ్ ఏర్పాటు చేస్తోన్న కాంట్రాక్ట్ సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేశారు. రామ్‌పథ్‌లో దాదాపు 6,400 బ్యాంబూ లైట్లు, భక్తి పథ్‌లో 96 ప్రొజెక్టర్ లైట్స్ అమర్చారు. మార్చి 19వ తేదీ వరకూ ఉన్న ఇవి.. తర్వాత కనిపించకుండా పోయాయి. మే 9న అక్కడ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ఈ లైట్లు కనిపించలేదు. మొత్తం 3,800 బ్యాంబూ లైట్స్, 36 ప్రొజెక్టర్ లైట్స్‌ని దొంగిలించారు. మూడు నెలల కిందటే చోరీని గుర్తించినప్పటికీ ఆగస్టు 9వ తేదీన FIR నమోదుచేయడం గమనార్హం. కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి శేఖర్ శర్మ రెండు రోజుల కిందట మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మే 9న జరిపిన తనిఖీల్లో లైట్లు ఏపీ కనిపించలేదని ఆరోపించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోపణలో వాస్తవం ఎంత? అనేది తెలుసుకోడానికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయోధ్య సీనియర్ ఎస్పీ రాజ్ కరణ్ నాయర్ మాట్లాడుతూ.. తమకు సహకరించాల్సిందిగా శర్మను కోరారు. ‘చోరీకి గురైన లైట్లు అమర్చిన నిర్దిష్ట ప్రదేశాలను గుర్తించాలని మేము ఫిర్యాదుదారుని అడిగాం’ అని మరో పోలీసు అధికారి తెలిపారు. భక్తి పథ్, రామ్ పథ్‌లో లైట్ల అమరిక బాధ్యతను కాంట్రాక్ట్ సంస్థకు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ అప్పగించింది. ఈ ఏడాది జనవరి 22 ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. గర్భాలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరవాత అయోధ్యకి భక్తుల తాకిడి పెరిగింది.