ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్తోన్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపుల రావడంతో దానిని న్యూఢిల్లీకి మళ్లించారు. సోమవారం ఉదయం ముంబయి నుంచి 239 మంది బయలుదేరిన ఎయిరిండియా విమానం.. న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమానాన్ని ప్రత్యేకంగా ఓ రన్‌వేపై నిలిపి.. భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
‘‘ముంబయి నుంచి న్యూయార్క్‌లో జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి అక్టోబరు 14న ఉదయం బయలుదేరిన AI 119 విమానానికి ముప్పు ఉందన్న హెచ్చరికలతో దానిని ఢిల్లీకి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశాం.. విమానంలోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చాం’ అని ఎయిరిండియా అధికార ప్రతినిధి వివరించారు. అనంతరం విమానాన్ని ఓ రన్‌వేపై నిలిపి.. బాంబు స్క్వాడ్ సహా భద్రతా సిబ్బంది ముమ్ముర తనిఖీలు చేస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. విమానంలోని వ్యక్తులందరి భద్రతను నిర్ధారించడానికి ప్రామాణిక భద్రతా ప్రమాణాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
‘విమానం ప్రస్తుతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది.. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన చెప్పారు. కాగా, దీనికి సంబంధించి ఎయిరిండియా ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. భద్రతను నిర్ధారించడానికి సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అధికారులు పనిచేస్తున్నారు. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణీకులు ఎదురుచూపులు చూస్తున్నారు. తదుపరి సూచనలు కోసం వారితో పాటు సిబ్బంది వేచి చూస్తున్నారు.