ఆంధ్రప్రదేశ్‌కు వర్షం, వరద రూపంలో పెద్ద విపత్తు వచ్చిపడింది. ముఖ్యంగా విజయవాడ పరిస్థితి దయనీయంగా ఉంది.. నాలుగు రోజుల తర్వాత పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోంది. రాష్ట్రంలో పరిస్థితుల్ని చూసిన ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నాయి.. కొందరు విరాళాలు ప్రకటిస్తుంటే.. మరికొందరు ఆహారం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి భారీగా విరాళాన్ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు.. నారా భువనేశ్వరి రూ.రెండు కోట్ల విరాళం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయనిధికి రూ.కోటి చొప్పున విరాళం అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయని.. సహాయచర్యలు, వరద ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణంలో ఆయా రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవడాన్ని బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు భువనేశ్వరి.