ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కీలకమైన చట్టం తీసుకురానుంది. ప్రతి ఏటా మే 31నాటికి ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకొని బదిలీల ప్రక్రియ ఉంటుంది. బదిలీల తర్వాత జూన్ 1న స్కూళ్లలో చేరేలా ఉత్తర్వులు ఇస్తారు. బదిలీలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్లు, ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా 8ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారు. హెచ్‌ఆర్‌ఏ 16% ఉన్న వాటిని కేటగిరి-ఏ, 12% వాటిని కేటగిరి-బీ, 10% ఉంటే కేటగిరి-సి, 5వేల కంటే తక్కువ జనాభా ఉంటే కేటగిరి-డీగా నిర్ణయిస్తారు. బదిలీల సమయంలో కేటగిరి-ఏకు ఒక పాయింటు, కేటగిరి-బీకి 2, కేటగిరి-సీకి 3పాయింట్లు,కేటగిరి-డీకి 4పాయింట్లు చొప్పున కేటాయిస్తుంది.
డిసెంబరు 5న టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబరులోనే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో టీచర్ల బదిలీల చట్టం ముసాయిదాపై విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతారు. అంతేకాదు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్‌పైనా చర్చించనున్నారు. బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీల ప్రక్రియ ఉంటుంది.. ఈ మేరకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు ప్రధానోపాధ్యాయులకు, ఏప్రిల్ 21 నుంచి 25 వరకు స్కూల్ అసిస్టెంట్లకు, మే ఒకటి నుంచి 10 వరకు ఎస్జీటీలకు బదిలీలు ఉంటాయి. ప్రమోషన్లకు సంబంధించి సీనియారిటీ జాబితాలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు ప్రదర్శిస్తారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు పూర్తికాగానే డీఎస్సీలో ఎంపికైన వారికి మే 11 నుంచి 30 వరకు పోస్టింగ్‌లు ఇస్తారు.