E-Filing Portal: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ప్రతి ఏటా జులై 31వ తేదీలోపు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్న క్రమంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ప్రతి సంవత్సరం ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు, మరింత సులభంగా ఐటీఆర్ ఫైలింగ్ చేసేలా వీలు కల్పించేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమైంది. యూజర్ ఫ్రెండ్లీ ఇ-ఫైలింగ్ పోర్టల్ తీసుకురానుంది. ట్యాక్స్ పేయర్లకు అనుకూలంగా ఉండేలా కీలక మార్పులు చేస్తూ ఇ-ఫైలింగ్ పోర్టల్ తెస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 8, 2024 రోజునే అంతర్గతంగా సర్క్యూలర్ జారీ చేసినట్లు ఈటీ వెల్త్ ఓ కథనంలో పేర్కొంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
అక్టోబర్ 8వ తేదీన జారీ చేసిన అంతర్గత సర్క్యూలర్ ప్రకారం.. ‘ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమగ్ర ఇ-ఫైలింగ్, సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (IEC) 2.0 త్వరలోనే ఆగిపోనుంది. కొత్త ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్ట్ ఐఈసీ 3.0 ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ ఐఈసీ 2.0 స్థానాన్ని భర్తీ చేయనుంది.’ అని ఐటీ శాఖ తన సర్క్యూలర్‌లో పేర్కొంది. కొత్త మార్పులతో తీసుకొస్తున్న పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని, దీంతో ఈజీగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులకు వీలు కలుగుతుందని తెలిపింది.