మహిళా ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం కానుక.. ప్రతి నెలా ఒకరోజు నెలసరి సెలవు

Odisha Govt Announced menstrual leave: నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే సాటి మహిళలే వాటిని అర్థం చేసుకోగలరు. పైపెచ్చు ఉద్యోగం చేసే వారయితే ఆ సమయంలో వచ్చే చిరాకుకు తోడు పని ఒత్తిడి వారిని మరింత చికాకు పెడుతూ ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని ఉద్యోగినులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ శుభవార్త చెప్పింది. కటక్‌లో జరిగిన ఇండిపెండెన్స్ వేడుకల్లో ఒడిశా డిప్యూటీ సీఎం పార్వతీ పరీదా దీనిపై ప్రకటన చేశారు. ఒడిశాలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగినులతో పాటుగా ప్రైవేటులో పనిచేసే మహిళా ఉద్యోగులకు కూడా ఈ నెలసరి సెలవు వర్తిస్తుందని పార్వతీ పరీదా వెల్లడించారు.

ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే మహిళలు తమ నెలసరి సమయంలో మొదటి లేదా రెండో రోజు.. ఈ సెలవును ఉపయోగించుకోవచ్చని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి పార్వతీ పరీదా తెలిపారు. మరోవైపు ప్రస్తుతం బిహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. 1992లోనే బిహార్ ఈ నెలసరి సెలవుల విధానాన్ని తీసుకువచ్చింది. అక్కడ ప్రస్తుతం ప్రతి నెలా రెండు రోజులు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నారు. ఇక గతేడాది కేరళ ప్రభుత్వం విద్యార్థినులను నెలసరి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇస్తోంది.

ఇక జొమాటో వంటి ప్రైవేట్ సంస్థల్లోనూ మహిళలకు ఇలా సెలవులు ఇస్తున్నారు. ఏడాదికి పది పెయిడ్ పీరియడ్ లీవ్స్‌లను జొమాటో 2020 నుంచి అమలు చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా నెలసరి సెలవులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు.మహిళలకు నెలసరి సెలవులకు సంబంధించి 2022లోనే కేంద్రం ఓ బిల్లు తీసుకువచ్చింది. అయితే ఆ బిల్లు ఇప్పటికీ ఆమోదం పొందలేదు. ఈ పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సరైన బహుమతి ఇచ్చారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

About amaravatinews

Check Also

హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను! మరోసారి భాషా వివాదంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌

పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుండగా, పవన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *