ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత సిలిండర్ పథకాన్ని దీపావళి రోజున ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్దిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేయనున్న విషయం తెలిసిందే. దీంతో ‘దీపం 2.0’ కింద బుకింగ్స్ మొదలు కాగా.. అక్టోబరు 31 నుంచి సిలిండర్లూ అందిస్తున్నారు. అయితే, ఈ పథకానికి తాము అర్హులమా? కాదా? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డులతో పోలిస్తే ఉచిత గ్యాస్‌కు అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. దీనికి గల కారణాలను తాజాగా అధికారులు వెల్లడించారు.
ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ వర్తింపజేస్తున్నామని.. వాటి వివరాలు లేకపోవడంతోనే అర్హుల సంఖ్య తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో 1.54 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. తాత్కాలిక అంచనా ప్రకారం ఉచిత సిలిండర్ పథకానికి 1.08 కోట్ల కనెక్షన్లు అర్హత సాధించాయి. కానీ, రేషన్ కార్డులు మాత్రం 1.48 కోట్లు ఉన్నాయి. అంటే దాదాపు 40 లక్షల మంది ఈ పథకంలో చేరాల్సి ఉంది. కానీ, కొంత మందికి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా.. ఆధార్ అప్‌డేట్ చేయకపోవడంతో అర్హత పొందలేకపోయారని అధికారులు పేర్కొన్నారు. వీరంతా ఆధార్‌ను అనుసంధానం చేసుకుంటే ‘దీపం 2.0’ పథకానికి అర్హులవుతారని, ఈ సంఖ్య పెరుగుతుందని చెప్పారు.
- వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి.
- కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే వస్తుంది.
- భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హులే.
- రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు/మూడు కనెక్షన్లున్నా.. ఒక్క కనెక్షన్‌కే రాయితీ వర్తిస్తుంది.
- టీడీపీ హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ ‘దీపం 2.0’ పథకం వర్తిస్తుంది.
- గ్యాస్ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.
- ఆన్‌లైన్‌లో లేదా డీలర్ వద్దకెళ్లి బుక్ చేసుకోవచ్చు.
- సిలిండర్ అందాక 48 గంటల్లో ఇంధన సంస్థలే రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి.
- సమస్యలుంటే 1967 (టోల్ ఫ్రీ) నంబరుకు ఫోన్ చేయొచ్చు.
- గ్రామ/ వార్డు సచివాలయాల్లో, ఎమ్మార్వో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చు.
ఒకవేళ ఉచిత సిలిండర్ల పథకానికి సంబంధించి ఏదైనా సందేహాలుంటే టోల్‌ఫ్రీ నంబరు 1967కు ఫోన్ చేయాలని తెలిపారు. ఇక, ఈ దీపం పథకానికి అవసరమైన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద నాలుగు నెలలకో సిలిండర్ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తోంది. ఈ పథకానికి రాయితీ రూపంలో ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
కాగా, ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర గరిష్ఠంగా రూ.876 ఉంది.. ఇందులో కేంద్రం రూ.25 వరకు రాయితీ ఇస్తుండగా.. మిగిలిన రూ.851ను సిలిండర్ అందిన 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించారు. అక్కడ గ్యాస్ ఆటోలకు పచ్చజెండా ఊపి, లబ్ధిదారులకు సిలిండర్లు అందజేశారు.