Diarrhoea in Gurla: డయేరియా మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సాయం.. 10 లక్షలు

విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించారు. డయేరియాతో బాధపడుతూ గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌తో సమీక్ష జరిపిన పవన్ కళ్యాణ్.. ప్రభుత్వం తరుపున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తామన్న పవన్ కళ్యాణ్.. తన తరఫున వ్యక్తిగతంగా రూ. లక్ష చొప్పున సాయం చేస్తానని ప్రకటించారు.

గుర్ల మండలంలో నీటి కలుషితం కారణంగా అతిసారంతో పదిమంది చనిపోవడం బాధించిందన్న పవన్ కళ్యాణ్.. రక్షిత మంచినీరు ప్రజల ప్రాథమిక హక్కని చెప్పారు. గత ఐదేళ్లలో సరిగ్గా పంచాయతీ నిధులను వినియోగించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యా్ప్తంగా చాలా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సమస్య ఉందన్న ఏపీ డిప్యూటీ సీఎం.. గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు వారసత్వంగా వచ్చాయని విమర్శించారు. అందులో ఈ సమస్య కూడా ఒకటని అన్నారు. గుర్ల గ్రామంలో డయేరియాతో చనిపోయిన మృతుల కుటుంబాలతో మాట్లాడానన్న పవన్.. 24 గ్రామాలకు నీటిని సరఫరా చేసే కేంద్రాన్ని కూడా పరిశీలించినట్లు చెప్పారు. విజయనగరం జిల్లా పారిశుధ్య, నీటి సరఫరా అంశాలపై అధ్యయనం చేసేందుకు సీనియర్ IAS అధికారి విజయానంద్‌ను నియమించామని.. స్థానిక యంత్రాంగంతో కలిసి అతిసారం సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించాలని అనుకోవడం లేదన్న పవన్ కళ్యాణ్.. కానీ ఐదేళ్లలో వారు కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదన్నారు. అలా చేసి ఉంటే నీరు కలుషితం అయ్యేది కాదని చెప్పుకొచ్చారు. 15 వ ఆర్థిక సంఘం నిధులను కూడా వాడలేదని పవన్ ఆరోపించారు. బహిరంగ మలవిసర్జన కారణంగా నీటి కలుషితం జరుగుతోందన్న డిప్యూటీ సీఎం.. దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం పంచాయతీల సర్పంచులు బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. త్వరలోనే మరో 650 కోట్లు గ్రామీణ నీటి సరఫరా కోసం కేంద్రం నుంచి వస్తాయన్న పవన్.. వాటిని కూడా నీటి సరఫరా మెరుగు పరిచేందుకు, రక్షిత మంచినీరు అందించేందుకు వినియోగిస్తామని చెప్పారు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *