వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మరో ముఖ్యమైన నేత ఆ పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గురువారం ఆ పార్టీని వీడబోతున్నట్లు కొందరు ట్వీట్‌లు చేశారు. మోపిదేవి చూపు తెలుగు దేశం పార్టీ వైపు ఉందని.. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు మోదలయ్యాయి. మోపిదేవి వెంకటరమణకు ఎంపీ పదవితో పాటుగా బాపట్ల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవి కూడా ఉంది. రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ప్రచారం నడుస్తోంది.
మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీలో చేరి.. 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999, 2004లో కూచినపూడి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్‌విభజనలో భాగంగా రేపల్లె నియోజకర్గం ఏర్పాటు కాగా.. 2009లో అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. మోపిదేవి వెంకట రమణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.