బ్యాంకింగ్ సిస్టమ్, అందులోని లోపాలను చూపెడుతూ ఈ మధ్య ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. హర్షద్ మెహతా కథ మొదలుకొని మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ వరకు బ్యాంకింగ్ సిస్టం మీద కథలు వచ్చాయి. ఈ జీబ్రా కూడా అలాంటి నేపథ్యంలోనే తెరకెక్కిందని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మరి ఈ జీబ్రా అందరినీ ఆకట్టుకుందా? లేదా? అన్నది చూద్దాం.
కథ
సూర్య (సత్య దేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. స్వాతి (ప్రియా భవానీ శంకర్) కూడా బ్యాంక్ ఉద్యోగి. తెలియకుండా జరిగిన చిన్న తప్పుతో ఒకరి అకౌంట్లో వేయాల్సిన డబ్బుల్ని బెన్నీ (టెంపర్ వంశీ) అకౌంట్లోకి వేస్తుంది స్వాతి. దీంతో సూర్య తన తెలివితో బెన్నీ అకౌంట్లోని డబ్బుల్ని తిరిగి విత్ డ్రా చేస్తాడు. కానీ ఆ తరువాత బెన్నీ అకౌంట్ నుంచి ఐదు కోట్లు మాయం అవుతాయి. ఆ ఐదు కోట్లతో ఆదిత్య (డాలీ ధనుంజయ) ఉన్న సంబంధం ఏంటి? వెయ్యి కోట్ల విలువైన ఎయిర్ లైన్‌ను డీల్ చేసే క్రమంలో మధన్ గుప్తా (సునీల్), ఆదిత్యలకు ఏర్పడిన వైరం ఏంటి? చిటిక వేస్తే వందల కోట్లను క్షణాల్లో పుట్టించగల ఆదిత్య.. కేవలం ఆ ఐదు కోట్ల కోసం సూర్యను పరుగులు ఎందుకు పెట్టిస్తాడు?. బ్యాంకులో పని చేసే సాధారణ ఉద్యోగి నాలుగు రోజుల్లో ఐదు కోట్లు ఎలా తిరిగి ఇస్తాడు? అసలు ఆ ఐదు కోట్లను మాయం చేసింది ఎవరు? ఐదు కోట్లను సంపాదించే క్రమంలో సూర్య బ్యాంకింగ్ సిస్టంలోని లోపాల్ని ఎలా వాడుకుంటాడు? చివరకు సూర్య, ఆదిత్యలు తమ తమ లక్ష్యాల్ని చేరుకుంటారా? లేదా? అన్నది కథ.
జీబ్రా కథని రెండు మూడు లేయర్లలో రాసుకోవడం, హీరో ట్రాక్, విలన్ ట్రాక్‌తో సమాంతరంగా సినిమాను నడిపించడం కాస్త బాగానే ఉంటుంది. దర్శకుడు పూర్తిగా ఈ కథను బ్యాంకింగ్ రంగం చుట్టూ రాసుకోలేదు. దీనికి మళ్లీ డాలీ ధనుంజయ్ ట్రాక్‌ను పెట్టుకున్నాడు. ఆ డాలీ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, ఫ్లాష్ బ్యాక్ సీన్లు అయితే మన తెలుగులో ఇంత వరకు చాలానే వచ్చి ఉంటాయి. ఓ సాధారణ వ్యక్తి.. కోల్ కతాకు వెళ్లడం.. బతికేందుకు వెళ్లి శాసించే స్థాయికి ఎదగడం ఇవన్నీ చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. ఇలాంటి రొటీన్ సీన్లే జీబ్రాను మరింత వెనక్కి నెట్టినట్టుగా అనిపిస్తాయి.
జీబ్రాలో ఈ సీన్ అదిరిపోయిందే అని అనుకుని సంబరపడిపోయే లోపు మళ్లీ రొటీన్, పాత కాలపు సీన్ ఒకటి పడుతుంది. ఆ సీన్ ఏంటో ఆడియెన్స్ ముందే పసిగట్టేస్తుంటారు. ఇలాంటి స్క్రీన్ ప్లే విషయంలోనూ కాస్త జాగ్రత్తలు పెట్టి ఉండాల్సింది. మధ్య మధ్యలో సౌండ్, స్క్రీన్ ఆగిపోతుంది. అది టెక్నికల్ ప్రాబ్లమా? స్టైలా? అన్నది అర్థం కాదు. కానీ ఏ సందర్భంలోనూ ఏ సీన్‌కి ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోతారనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే కథతో,పాత్రలతో ట్రావెల్ చేయడం కష్టం అవుతుంది.
అలా ఎమోషనల్‌గా డిస్ కనెక్ట్ అయినప్పుడే లాజిక్‌లు స్టార్ట్ అవుతాయి. ఇది ఎందుకు అలా.. అది ఎందుకు ఇలా అని లాజిక్స్ తీస్తుంటారు. జీబ్రాలో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవ్వడంతో పాటు అసందర్భంగా పాటలు ఉంటాయి. మధ్యలో ఓ ఐటం సాంగ్ కూడా ఉంటుంది. కనీసం సాంగ్ బాగుందా? అని అంటే అది కూడా చెప్పడం కష్టమే. ఫస్ట్ హాఫ్ వరకు సూర్య ఆ ఐదు కోట్లు ఎలా తీసుకు వస్తాడా? అని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఇంటర్వెల్ సీన్‌కు హీరోకి మరింత పెద్ద సమస్య వస్తుంది. వాటి నుంచి ఎలా తప్పించుకుంటాడనే ఆసక్తిని రేకెత్తించే సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది.
బ్యాంక్ సెక్యురిటీ సిస్టం, లాకర్ల సిస్టం, బ్యాంకింగ్ టర్మినాలజీ ఇవన్నీ కాస్తో కూస్తో తెలిస్తే.. జీబ్రా ఈజీగా ఎక్కేస్తుంది. లేదంటే చాలా కష్టమే. మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ పోలికలు ఇందులో కాస్త కనిపిస్తాయి. లక్కీ భాస్కర్ విషయంలో ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టేశారు. కానీ జీబ్రాకి అలా జరిగే అవకాశం లేదనిపిస్తుంది. లవ్ ట్రాక్ ఏమంతగా మెప్పించదు. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు.
డాలీ ధనుంజయ పూర్తిగా విలన్ అని చెప్పలేం.. పూర్తిగా హీరో అని చెప్పలేం. అసలు కొన్ని చోట్ల సత్యదేవ్ కంటే డాలీకే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు. సత్య దేవ్ సైడ్ హీరోలా అనిపిస్తాడు. సత్య, సత్యదేవ్ కామెడీ ట్రాక్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ఇక చివరి పది నిమిషాల వరకు హీరో ఇదంతా ఎందుకు చేస్తున్నాడా? అని అనుకుంటారు. కానీ ఆ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. చివరగా చూస్తే.. జీబ్రా పార్ట్ 2కి కూడా ఛాన్స్ ఉందనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఈ విషయం మీద చిత్రయూనిట్ చెప్పలేదు.
సత్యదేవ్ తన పాత్ర కోసం ఎంత చేయాలో అంతా చేశాడు. సూర్య కారెక్టర్‌లో ఇంటెన్స్ చూపించాడు. కొన్ని చోట్ల కామెడీని పండించాడు. ఎమోషనల్‌గా నటించాడు. ప్రియా భవానీ శంకర్ ఓ రెగ్యులర్ హీరోయిన్ పాత్ర అంతే. డాలీ ధనుంజయ ఈ చిత్రానికి హీరో ప్లస్ విలన్ టైపు. డాలీ తన పాత్రలో మెప్పిస్తాడు. కానీ చాలా రొటీన్ అనిపిస్తుంది. కమెడియన్ సత్య మళ్లీ నవ్వించేశాడు. కనిపించిన ప్రతీ సారి ఆడియెన్స్‌ను గిలిగింతలు పెట్టించినట్టు నవ్వించేస్తాడు. సునీల్ గెటప్ కొత్తగా ఉంటుంది. యాక్టింగ్ మాత్రం రొటీన్ విలన్‌గా ఉంటుంది. ఏ టు వై బాబా పాత్రలో సత్య రాజ్ మెప్పిస్తాడు. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.
సాంకేతికంగా జీబ్రా పర్వాలేదనిపిస్తుంది. రవి బస్రూర్ ఇచ్చిన పాటలు గుర్తుండకపోయినా.. ఆర్ఆర్ మెప్పిస్తుంది. మాటలు కొన్ని చోట్ల బాగుంటాయి. విజువల్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. నిర్మాతలు జీబ్రా కోసం బాగానే ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది. మరి ఆ ఖర్చు లాభాల రూపంగా మారుతుందా? లేదా? అన్నది మున్ముందు తెలుస్తుంది.