వైసీపీ నుంచి వచ్చిన నేతకు చంద్రబాబు ప్రమోషన్.. ప్రభుత్వంలో కీలక పదవి

వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ ట్రస్టు) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌గా విశాఖపట్నంకు చెందిన నేత సీతంరాజు సుధాకర్‌ను నియమించారు.ఆయన రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. సీతంరాజు సుధాకర్ గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్నారు.. గతేడాది డిసెంబర్‌లో ఆయన టీడీపీలో చేరారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. విశాఖపట్నం నుంచి కీలక నేత కావడంతో ఆయనకు పదవిని అప్పగించినట్లు తెలుస్తోంది.

సీతంరాజు సుధాకర్‌కు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. దాదాపు 20 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. 2013లో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు వైఎస్సార్‌సీపీలో వైఎస్ జగన్‌తో పాటు ముఖ్య నేతలకు సన్నిహితంగా ఉన్నారు సుధాకర్. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓడింది.. అప్పటి నుంచి విశాఖపట్నంలో పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. అలాగే 2019లో కూడా వైఎస్సార్‌సీపీ కోసం పనిచేశారు.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సుధాకర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామనే హామీ వచ్చింది. అయితే ఆ పదవి ఆయనకు దక్కలేదు.. 2021లో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి దక్కింది.. అలాగే 2023 ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.

సుధాకర్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాగా.. అక్కడి నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపారు. దీంతో అప్పటి నుంచి దక్షిణ నియోజకవర్గంలో వర్గపోరు మొదలైంది. సీతంరాజు సుధాకర్ దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు.. కానీ ఆ అవకాశం దక్కే పరిస్థితి కనిపించలేదు. అప్పటి నుంచి సుధాకర్ పార్టీకి కాస్త దూరమయ్యారు.. కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తనకు పార్టీలో గౌరవం దక్కలేదని.. అధిష్ఠానం అవమానకరరీతిలో వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అనుచరులతో చర్చించి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటూ విశాఖపట్నంలో కొందరు కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆయన పనిచేశారు. దీంతో తాజాగా ఆయనకు ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ ట్రస్టు) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.

About amaravatinews

Check Also

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *