నేటి ఆధునిక సాంకేతిక యుగంలో.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మారుతున్న కాలానుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోంది. ఈ క్రమంలోనే వివో, జియోమి, హువాయ్ వంటి మొబైల్ తయారీ సంస్థలు త్వరలో ఎలాంటి నెట్‌వర్క్ లేకుండా పనిచేసే మొబైల్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు అడవిలో ఉన్నా లేదా పర్వతాలపై ఉన్నా నెట్‌వర్క్ అవసరం లేదు. ఎలాంటి నెట్‌వర్క్ లేకుండానే కాలింగ్, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ కంపెనీలు తన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ గ్యాడ్జెట్ శాటిలైట్ ఆధారిత నెట్‌వర్క్ అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్‌ని డైరెక్ట్‌గా శాటిలైట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా కాలింగ్, డేటా సేవలను పొందొచ్చు.
ఈ ఫోన్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. పర్వత ప్రాంతాల్లో లేదా విపత్తుల సమయంలో మొబైల్ నెట్‌వర్క్‌లు పని చేయని చోట కూడా ఫోన్ నుండి కాల్స్ చేయగలరు. శాటిలైట్ ఫోన్‌లు ఆకాశం యొక్క స్పష్టమైన వీక్షణతో ప్రతిచోటా పని చేస్తాయి. అవి భూమి కక్ష్యలో ఎత్తైన ఉపగ్రహాల ద్వారా పనిచేస్తాయి. కాబట్టి అవి సరిగ్గా పనిచేయడానికి అవరోధం లేని వీక్షణ అవసరం. పర్వత ప్రాంతాలు, ఎడారులు, సముద్రంలో ఎక్కడైనా కవరేజీని అందిస్తాయి. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహానికి నేరుగా కనెక్ట్ చేయడం ద్వారా ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ టెక్నాలజీ ఇప్పటికీ కొత్తది. క్రమంగా మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లలో పరిచయం చేయనున్నారు. అయితే ఆపిల్ ఇప్పటికే తన ఐఫోన్‌లో ఈ ప్రత్యేక ఫీచర్‌ను అందిస్తోంది. అయితే.. మనం దీన్ని భారతదేశంలో ఉపయోగించలేము.
ఇది ఎలా పని చేస్తుందంటే..?
ఈ ప్రత్యేక టెక్నాలజీలో స్మార్ట్ ఫోన్ ఉపగ్రహానికి వెళ్లే ప్రత్యేక రకం సిగ్నల్‌ను పంపుతుంది. ఉపగ్రహం ఈ సిగ్నల్‌ను స్వీకరించి, దానిని మరొక ఫోన్ లేదా నెట్‌వర్క్‌కి ప్రసారం చేస్తుంది. దీంతో మనం నెట్‌వర్క్ లేని ప్రాంతంలో ఎలాంటి సమస్య లేకుండా వేరొకరితో కనెక్ట్ కావొచ్చు. Vivo, Xiaomi, Huawei వంటి అనేక పెద్ద కంపెనీలు కూడా శాటిలైట్ ఫోన్‌లపై పనిచేస్తున్నాయి. కొన్ని చిప్‌ల తయారీ కంపెనీలు కూడా ఈ సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. దీంతో.. ఈ టెక్నాలజీని త్వరలో భారతదేశంలో కూడా చూడవచ్చు. తాజా సమాచారం ప్రకారం.. ఈ టెక్నాలజీ ప్రస్తుతం చాలా ఖరీదైనది. అందువల్ల ఇది చాలా తక్కువ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
శాటిలైట్ ఫోన్ వల్ల ఉపయోగాలు :
ఇప్పటికే ఉన్న కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లు పని చేయనప్పుడు అత్యవసర సమయంలో కమాండ్ అండ్ కంట్రోల్ ఫంక్షన్‌లను నిర్వహించడానికి శాటిలైట్ మొబైల్ ఫోన్‌లు సహాయపడతాయి.