SSY Documents Required: మీరు సంపాదించిన దాంట్లో ఏమైనా పొదుపు చేస్తున్నారా.. దీనిని పెట్టుబడుల రూపంలోకి మళ్లించి డబ్బు సృష్టిస్తున్నారా. లేకపోతే ఇప్పటినుంచే అలవర్చుకోవడం మంచిది. అప్పుడే మలివయసులో, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా హాయి జీవితం గడపొచ్చు. ఇంకా మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఇబ్బందులు లేకుండా ఉండేందుకు.. ఆడపిల్లకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఒక గొప్ప పథకం తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి అకౌంట్. ఆడపిల్ల 10 సంవత్సరాల్లోపు వయసులో ఈ స్కీంలో చేరాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో ఈ పథకంలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇతర చాలా పథకాల కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ దీంట్లో వస్తున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నింట్లో కూడా దీంట్లోనే వడ్డీ రేటు ఎక్కువ. ప్రస్తుతం ఇందులో 8.20 శాతం వడ్డీ రేటు ఉంది. చిన్న మొత్తాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ పోతే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధి సమకూర్చుకోవచ్చు. ఇది పాప ఉన్నత చదువులు సహా పెళ్లి కోసం ఉపయోగించుకోవచ్చు.
ఈ పథకంలో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. మెచ్యూరిటీ సమయంలో అందుకునే డబ్బులకు ఎలాంటి టాక్స్ పడదు. ఇంకా ఆదాయపు పన్ను చట్టం-1961 సెక్షన్ 80c కింద పాత పన్ను విధానం ప్రకారం.. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల టాక్స్ తగ్గించుకోవచ్చు. దీనిని ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంక్ లేదా పోస్టాఫీసులో తెరవొచ్చు.