Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో సుమారు 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఇటీవలే బెయిల్ దొరకగా.. ఇప్పుడు ఈ కేసులో నిందితునిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం.. మరో రెండు వారాలు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.
అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని ఈడీ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనకు జస్టిస్ ఎంఎం సుందరేశ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం అంగీకరించింది. దీంతో విచారణను వాయిదా వేసింది. ఈ ఏడాది జులైలో జస్టిస్ సంజయ్ కుమార్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్.. అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్‌పై మరో బెంచ్ విచారించాలని ఆదేశించింది.
అంతకుముందు, మార్చి 20న.. అభిషేక్ భార్య అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన 5 వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో.. పాస్‌పోర్టును అధికారులకు అప్పగించాలని.. హైదరాబాద్, ఢిల్లీని వదిలి ఎక్కడికీ వెళ్లరాదని ఆదేశించింది. మొబైల్ నెంబర్‌ను ఈడీ అధికారులకు ఇవ్వటంతో పాటు.. వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది. కాగా.. ఆ తర్వాత ఈ మధ్యంతర బెయిల్‌ను పలుమార్లు పొడిగిస్తూ వస్తోంది.
మరోవైపు.. ఈ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాత్రం ఇప్పటికీ తీహార్ జైలులోనే ఉండటం గమనార్హం. సుమారు 4 నెలలకు పైగానే ఆమె బెయిల్ కోసం పోరాటం చేస్తున్నా.. అదృష్టం కలిసిరావట్లేదు. అటు రౌస్ ఎవెన్యూ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడా కవితకు బెయిల్ దొరకట్లేదు. ఇదే క్రమంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా ఈ కేసులో అరెస్టవగా.. ఎన్నికల సమయంలో బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ.. మళ్లీ తిరిగి వెళ్లారు. ఇలాంటి సమయంలో.. అభిషేక్ బోయినపల్లికి బెయిల్ పొగిడిస్తూ తీర్పు రావటంతో.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.