Tax Refund Status: ఇన్‌కంటాక్స్ రీఫండ్స్ గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. గతవారం పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ (ITR) ప్రాసెస్ చేసేందుకు తీసుకునే సగటు సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. గతంలో అంటే 2013లో ఐటీఆర్ ప్రాసెసింగ్ కోసం సగటున 93 రోజులు పట్టగా.. ఇప్పుడు అది 10 రోజులకు దిగొచ్చిందని అన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన గొప్ప ఘనత అని అన్నారు. అంటే ఈ లెక్కన ప్రాసెసింగ్ త్వరగా జరుగుతున్నందున.. రీఫండ్స్ కూడా వేగంగా వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మరింత వేగంగా అకౌంట్లలోకి రీఫండ్ డబ్బులు వస్తాయని చెబుతున్నారు.
అయితే యావరేజ్ ప్రాసెసింగ్ టైమ్ ఇప్పుడు 10 రోజులకు తగ్గిందని నిర్మలమ్మ చెప్పారు కానీ ఇది అన్నింటికీ వర్తించదు. ఐటీఆర్ ఫారంలో ఉన్న కాంప్లికేషన్స్‌ను బట్టి ఈ సమయం ఎక్కువ, తక్కువ కావొచ్చు. అంటే ఐటీఆర్ రకాన్ని బట్టి మారుతుంటుంది. ఐటీఆర్-1 ఫారం కంటే ఐటీఆర్-2 కాస్త క్లిష్టంగా ఉంటుంది. ఐటీఆర్-2 కంటే ఐటీఆర్-3 కష్టంగా ఉంటుంది. దీనిని బట్టి అన్నింటికీ ఒకేలా ఉండదు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ చేసిన వెంటనే.. ఐటీ శాఖ దానిని ప్రాసెస్ చేయదు. నెల రోజుల్లోగా ఇ- వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అసలు ప్రాసెసింగ్ మొదలుపెడుతుంది.
ఐటీఆర్-2, ఐటీఆర్-3 రీఫండ్ క్లెయిమ్స్ కోసం అయితే సాధారణంగా ఎలాంటి తప్పులు, సర్దుబాట్లు లేని వాటికే నెలల సమయం పట్టొచ్చని అన్నారు ఇన్‌కంటాక్స్ మాజీ చీఫ్ కమిషనర్ రామక్రిష్ణన్ శ్రీనివాసన్. ఇక ఐటీఆర్-1 ఎలాంటి తప్పుల్లేకుండా ఫైల్ చేస్తే కొన్ని రోజుల్లోనే ప్రాసెసింగ్ చేసి.. రీఫండ్స్ వస్తాయని.. ఇంకా గడువు తేదీకి చాలా దగ్గర్లో ఫైలింగ్ చేస్తే వారికి ఆలస్యం కావొచ్చని అన్నారు. ఏదేమైనా ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని వివరాల్ని స్పష్టంగా పేర్కొన్న వారికి రీఫండ్స్ వేగంగా వస్తాయని వివరించారు.