హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హబ్సిగూడ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ స్కూల్ ఆటో.. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో అతివేగంతో రావటం వల్ల.. బస్సు వెనకాల కిందకు దూసుకుని వెళ్లింది. ఈ ఘటనలో.. ఆటో డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న పదో తరగతి విద్యార్థిని బస్సు కింద ఉరుక్కుపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి తొలగించారు. అమ్మాయితో పాటు ఆటో డ్రైవర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర గాయాలై విద్యార్థినిని పోలీసులు నాగోల్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించగా.. చికిత్స పొందుతూ అమ్మాయి మృతి చెందింది. విద్యార్థిని.. గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న సాత్వికగా గుర్తించారు. తార్నాక నుంచి హబ్సిగూడలోని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ అత్యంత వేగంగా నడపడమే ప్రమాదాన్ని కారణమని పోలీసులు అంచనావేస్తున్నారు. మరోవైపు.. ఆటో డ్రైవర్ మొబైల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేశాడంటూ స్థానికులు చెప్తున్నారు.