తెలంగాణలోని రైలు ప్రయాణికులకు తీపి కబురు. రెల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. ప్రయాణికులకు ఉపయోగపడే మూడు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు కీలకదశలో ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. పుణే, ముంబయి వైపు వెళ్లే సికింద్రాబాద్-వాడి మార్గం ప్రస్తుతం రెండు లైన్లతో ఉండగా.. దాన్ని విస్తరించనున్నారు. క్వాడ్రాప్లింగ్ (నాలుగు లైన్ల)కు విస్తరించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమవుతోంది. ఈ లైన్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ఇప్పటికే రైల్వే బోర్డుకు అందింది. బోర్డు అనుమతి లభిస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు మంజూరు అవుతుందని రైల్వేశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
దాంతో పాటుగా తెలంగాణలో మరో రెండు లైన్ల మంజూరుకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కరీంనగర్-హసన్‌పర్తితో పాటు డోర్నకల్-మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్లకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. ఇవి కొంతకాలం క్రితమే రైల్వే బోర్డుకు చేరాయి. ఈ మూడు రైల్వే ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.7,840.37 కోట్లుగా నిర్ణయించారు. ప్రాజెక్టులకు సంబంధించిన అలైన్‌మెంట్, దూరం, అంచనా వ్యయం వివరాలను డీపీఆర్‌లో పొందుపరిచారు. తెలంగాణ ప్రభుత్వం, ఎంపీలు ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ మూడు రైల్వే ప్రాజెక్టులు వచ్చే బడ్జెట్‌లోనే మంజూరయ్యే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పుణేకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్, ముంబయికి వెళ్లే హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ సహా పలు ట్రైన్లు వికారాబాద్, వాడి మార్గంలో ప్రయాణ రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం వాడి వరకు రెండు లైన్ల ట్రైన్ మార్గం మాత్రమే ఉంది. ట్రైన్ల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రైమరీ సర్వే, ఫైనల్ లొకేషన్ సర్వేలు పూర్తయినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్పారు.
ఇక డోర్నకల్-మిర్యాలగూడ కొత్త ట్రైన్ మార్గంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ రైలు మార్గాలు కనెక్ట్ అవుతాయి. ప్రతిపాదిత ట్రైన్ మార్గం సరకు రవాణాకు అత్యంత కీలకం అవుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. మిర్యాలగూడ సమీపంలోని దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయాల్సి ఉంటుంది. అందుకు ఈ ట్రైన్ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది.
హసన్‌పర్తి నుంచి హుజూరాబాద్ మీదుగా కరీంనగర్ వరకు కొత్త ట్రైన్ మార్గం నిర్మించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ, సౌత్ స్టేట్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌కు కాజీపేట, రామగుండం, బల్లార్ష, వార్దా మీదుగా ట్రైన్ల రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉంది. హసన్‌పర్తి- కరీంనగర్ ట్రైన్ మార్గం మంజూరైతే హనస్‌పర్తి నుంచి హుజూరాబాద్, కరీంనగర్‌కు.. అక్కడ్నుంచి ప్రస్తుతం ఉన్న కరీంనగర్-జగిత్యాల-నిజామాబాద్-బాసర-నాందేడ్-ఔరంగాబాద్ ట్రైన్ మార్గంలో రైళ్ల రాకపోకలు సాగించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ మూడు ప్రాజెక్టులు మంజూరైతే ఆయా ప్రాంతాలకు మహర్దశ పడుతుందని రైల్వే అధికారులు అంటున్నారు.